ముక్క లేకుండా ముద్ద దిగదని...
రాయ్ బరేలీ(ఉత్తరప్రదేశ్): మాంసం బదులు శాకాహారం వడ్డించినందుకు బంధువులు వివాహ విందు భోజనాన్ని బహిష్కరించారు. దీంతో ఆ ఇంటాయన చిన్నబుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాంసదుకాణాల మూసివేత ఎఫెక్ట్ ఇది. భోజిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొరాదాబాద్ గ్రామానికి చెందిన హమీద్ అన్సారీ తన కుమార్తె పెళ్లి సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని అనుమతులు లేని మాంసం దుకాణాలను అక్కడి ప్రభుత్వం మూసివేయించటంతో ఆయనకు ఇబ్బంది వచ్చి పడింది. సాధారణంగా విందుల్లో ఉండాల్సిన మాంసాహార పదార్థాలను వడ్డించేదెలాగని ఆయన మథనపడ్డారు.
మామూలు రోజుల్లో కిలో రూ.150కే లభించాల్సిన గేదె మాంసం ధర రూ.400కు, మేక మాంసం అయితే రూ.350 నుంచి రూ.600కు, చికెన్ ధర రూ.260 నుంచి రెట్టింపు పెరిగింది. అయినప్పటికీ ఎంతోకొంత కొనుగోలు చేయాలన్న అన్సారీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన శాకాహార మటర్ పనీర్, మష్రూమ్ కర్రీ, దాల్ మఖ్నీ వంటివి చేయించారు. ఈ విందుకు హాజరైన బంధు మిత్రులు ఆయనపై గుర్రుమన్నారు. ముక్క లేకుండా ముద్ద దిగేదెలాగని ప్రశ్నించారు. ఈ భోజనం తినలేమంటూ ఆ విందును బహిష్కరించారు.