యూపీలో ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చిన దొంగలు
ఫిరోజాబాద్: యూపీలో ఇద్దరు కానిస్టేబుళ్లను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఫిరోజాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో డీఐజీ సహా పలువురు గాయపడ్డారు. ఇక్కడి రామ్‌గఢ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు పారిపోతున్న విషయం తెలుసుకున్న దినేశ్ ప్రతాప్ సింగ్, గిరిరాజ్ కిశోర్ గుజ్జార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని వెంటాడారు. అయితే దుండగులు కాల్పులు జరపడంతో గిరిరాజ్ అక్కడికక్కడే చనిపోగా.. దినేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ జిల్లా ఆసుపత్రి వద్ద సోమవారం ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపుచేయడానికి ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలు వాహనాలు, షాపులను ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఓ పోలీస్ వాహనాన్ని కూడా తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో డీఐజీ విజయ్‌సింగ్ మీనా సహా పలువురు గాయపడ్డారు. హతమైన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సీఎం అఖిలేశ్‌యాదవ్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.