రికార్డుల రాణి.. సుష్మ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ రికార్డుల ఖాతాలోకి మరొకటి చేరింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ చరిత్ర సృష్టించారు. గతంలో 25 ఏళ్ల చిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక రికార్డును, ఢిల్లీ తొలి మహిళా సీఎంగా మరో రికార్డును ఆమె సృష్టించిన విషయం తెలిసిందే. అన్ని పార్టీల్లోనూ.. మొదటి మహిళా అధికార ప్రతినిధి కూడా ఆమెనే కావడం విశేషం. ప్రపంచ రాజకీయాల్లో, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషించాల్సిన ప్రస్తుత తరుణంలో ఆమె విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పాకిస్థాన్, చైనాలతో సంబంధాలు విదేశాంగ మంత్రిగా ఆమెను కాలపరీక్షకు నిలబెట్టేవే. విదేశాంగ శాఖ మంత్రే కాకుండా, కార్యదర్శి కూడా మహిళే కావ డం విశేషం. ప్రస్తుతం సుజాతాసింగ్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.