వెళ్లండి.. లేదా వెళ్లగొడతాం | Telangana lawyers to protest to division of High court | Sakshi
Sakshi News home page

వెళ్లండి.. లేదా వెళ్లగొడతాం

Published Tue, Jul 26 2016 4:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

వెళ్లండి.. లేదా వెళ్లగొడతాం

వెళ్లండి.. లేదా వెళ్లగొడతాం

 హైకోర్టును విభజించాలని ఢిల్లీలో తెలంగాణ న్యాయవాదుల మహాధర్నా
విభజన జరగకుండా వెంకయ్య, చంద్రబాబు కుట్రపన్నుతున్నారు
ఉమ్మడి హైకోర్టును అడ్డం పెట్టుకుని తెలంగాణపై పెత్తనం చేస్తున్నారు
చేతులకు సంకెళ్లతో నిరసన

 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ న్యాయవాదులు ఢిల్లీలో కదం తొక్కారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. వెళ్లండి.. లేదా వెళ్లగొడతామంటూ నినాదాలు చేశారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పా టు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రాష్ట్రంలోని అన్ని బార్ అసొసియేషన్ల సభ్యులు కలిపి సుమారు రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగా మరో పోరాటం చేసి ప్రత్యేక హైకోర్టును సాధించుకుంటామని వారంతా నినదించారు.
 
 నిర్దిష్ట గడువుతో ప్రణాళిక ప్రకటించాలి
 హైకోర్టు విభజనకు నిర్దిష్ట గడువుతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకటించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయాధికారుల విభజనకు అనుసరించిన ఆప్షన్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని... కింది స్థాయి కోర్టుల జడ్జీలు, న్యాయస్థానాల సిబ్బందిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ ధర్నాతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని... తమ న్యాయమైన పోరాటాన్ని గుర్తించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబులే హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టును అడ్డు పెట్టుకుని తెలంగాణపై పెత్తనం చెలాయించడానికి వారు కుట్రపన్నారని పేర్కొన్నారు. కాగా న్యాయవాదుల ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మద్దతు పలికారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్, జితేందర్, సీతారాం నాయక్ పాల్గొని మద్దతు పలికారు.
 
 కాస్త ఓపిక పడదాం..: ఎంపీ కవిత
 తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా హైకోర్టు విభజన జరగ కపోవడంతో న్యాయవాదులే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. వారి పోరాటానికి అండగా ఉంటామన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ఈ అంశంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అన్నిరకాలుగా ఒత్తిడి తెస్తున్నారని.. గత వారం జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలోనూ, ప్రధాని మోదీతో భేటీలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారని.. హైకోర్టు విభజనకు ఆయన చొరవ తీసుకుంటారన్న నమ్మకముందని పేర్కొన్నారు.

అందువల్ల హైకోర్టు విభజనపై కాస్త ఓపిక పడదామని, అయినా ఏర్పాటు చేయకపోతే పోరాడి సాధించుకుందామని చెప్పారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పడిన రెండు నెలల్లోనే వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేశారని.. కానీ తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా హైకోర్టు ఏర్పాటు చేయలేదని టీఆర్‌ఎస్ మరో ఎంపీ వినోద్ పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రం చొరవ తీసుకుని ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ధర్నాకు టీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement