ఆహార కొరత ముప్పు | The threat of food shortages | Sakshi
Sakshi News home page

ఆహార కొరత ముప్పు

Published Fri, Aug 11 2017 1:18 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఆహార కొరత ముప్పు - Sakshi

ఆహార కొరత ముప్పు

‘ఇండియన్‌ టెక్నాలజీకాంగ్రెస్‌–17’లో మేధావుల ఆందోళన
2050కి 70 శాతం జనాభా పట్టణప్రాంతాల్లోనే.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు అవసరం


బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి పెరగడం లేదని, దీనిపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు దృష్టి సారించకపోతే ఆహార కొరత తప్పదని ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌–2017(ఐటీసీ) సదస్సు గురువారం ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సు తొలిరోజు ఐటీసీ చైర్మన్‌ డాక్టర్‌ ఎల్‌వీ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అగ్రిటెక్‌ ఇన్‌క్లూషన్‌ చైర్మన్, నాబార్డ్‌ చైర్‌ ప్రొఫెసర్‌ అయ్యప్పన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం దేశజనాభాకు సరిపడా ఆహారం ఉత్పత్తి జరగడం లేదని, దేశంలో సన్నకారు రైతులకు ప్రోత్సాహకాలు అందక నష్టాల్లో కూరుకుపోయారని చెప్పారు. 2050కి దేశ జనాభాలో 70శాతం పట్టణ ప్రాంతంలో ఉంటారని, వ్యవసాయం తగ్గడం వల్ల ఆహార కొరత ముప్పు ఉండవచ్చని తెలిపారు. ‘అమెరికా, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో వలే ఇక్కడ కూడా వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు రావాలి. సన్నకారు రైతులకు ప్రభుత్వాలు అండగా ఉండి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి. అందుకు విప్లవాత్మక మార్పులు అవసరం’ అని అన్నారు.

పారిశ్రామిక విప్లవంపై మేధోమథనం జరగాలి
ఐటీసీ చైర్మన్‌ డాక్టర్‌ ఎల్వీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘పారిశ్రామిక విప్లవం 4.0తో కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. నైపుణ్యం పెంచడం, సమాచారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో వినియోగదారుడు ఏ ఫీచర్స్‌తో వస్తువు కోరుకుంటాడో అలా తయారు చేసేలా పరిశ్రమలు రానున్నాయి.

ఒకే పరిశ్రమలో అన్ని రకాల వస్తువులు తయారు చేసే ‘ప్యూచర్‌ ఫ్యాక్టరీస్‌’పై అగ్రదేశాలు దృష్టి సారించాయి. ఇది త్వరలో మన దేశంలో కూడా రానుంది’ అని పేర్కొన్నారు. వ్యవసాయాభివృద్ధికి ఇస్రో ప్రాధాన్యత ఇస్తుందని ఇస్రో బెంగళూరు సెంటర్‌ డైరెక్టర్‌ అన్నాదొరై చెప్పారు. ‘రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ ద్వారా వ్యవసాయభూములు, పంటల చిత్రాల్ని విశ్లేషించి పరిశోధనలకు సహకరిస్తున్నాం. అగ్రి అప్లికేషన్స్‌కు ఓ శాటిలైట్‌ ఏర్పాటు చేస్తాం. ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తాం’ అన్నారు.

సీఎస్‌ఐఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వీఎస్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ 2025కు ఆహారకొరత దేశానికి ప్రధాన సమస్య కానుందని, ఏడేళ్లలో వ్యవసాయరంగంలో వంద శాతం అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు శ్రమించాలని సూచించారు. పారిశ్రామికంగా భారత్‌ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, కార్పొరేట్‌ యాజమాన్యాలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మరింత చొరవ చూపి దేశాభివృద్ధికి సహకరించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఇంజనీర్స్‌ జాతీయ అధ్యక్షుడు పి.కృష్ణన్‌ పేర్కొన్నారు. సమావేశం అనంతరం పారిశ్రామిక, వ్యవసాయ, టెక్నాలజీ రంగాలపై వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. పలు రంగాల్లో  సేవలందించిన 11మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. డాక్టర్‌ డీవీ నాగభూషణ్, బీఎన్‌ త్యాగరాజులకు 2017 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారాల్ని అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement