ఈ సీటు సీఎం కోసమంటూ లాలూను లేపారు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాధారణంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎక్కడికి వెళ్లినా పెద్దన్నా అని సంబోధిస్తుంటారు. ముఖ్యంగా బిహార్ ఎన్నికలప్పటి నుంచి ఈ పిలుపు దాదాపుగా ఆయన మాట్లాడిన ప్రతి చోట వినిపిస్తోంది. ఎందుకంటే 2015 ఎన్నికల్లో అనూహ్య సీట్లు సొంతం చేసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆ తర్వాత నితీశ్‌కు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సహాయపడింది. దీంతో అప్పటి నుంచి లాలూ పట్ల నితీశ్ కాస్తంత గౌరవంగానే ఉంటున్నారు.
అయితే, ఆదివారం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పట్నాలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో వేదికపైకి వెళ్లిన లాలూ అనుకోకుండా ముఖ్యమంత్రి నితీశ్‌కు ఏర్పాటుచేసిన సీటులో కూర్చున్నారు. ఇది గమనించిన కార్యక్రమ నిర్వాహకులు అది ముఖ్యమంత్రి కోసం ఏర్పాటుచేసిన సీటు అని, వేరే సీట్లో కూర్చోవాలని చెప్పారు. దీంతో ఎలాంటి ఆగ్రహానికి లోనవ్వకుండానే లాలూ మర్యాదగా వెళ్లి పక్క సీట్లో కూర్చున్నప్పటికీ ఆ చర్య ఆయనకు కొంత ఇబ్బందిని కలిగించినట్లు కనిపించారు.
అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ వచ్చి ఆయన సీట్లో కూర్చోగా వీఐపీ సీట్ల వరుసలో లాలూ కూర్చున్నారు. ఇప్పటికే నితీశ్ తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదని ఆర్జేడీ నేతలు తెగ మదనపడుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సిక్కు గురు గోవింద్ సింగ్ 350వ జయంతికి వచ్చిన సందర్భంగా కూడా మోదీతో కేవలం నితీశ్ మాత్రమే వేదికను పంచుకోవడం కూడా ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అయితే, తమ మధ్య అలాంటి వైరుధ్యాలు లేవంటూ లాలూ, నితీశ్ స్పష్టం చేశారు.