లాకప్ డెత్!
సాక్షి, చెన్నై: విచారణ పేరిట పోలీసు స్టేషన్‌లో ఓ యువకుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ కాల్చి చంపేశాడు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు కత్తితో పొడుచుకుని హైడ్రామా సాగించి, చివరకు సస్పెండ్‌కు గురయ్యాడు. రామనాథపురం జిల్లా ఎస్‌పీ పట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటన మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలను రగిల్చింది. ఇటీవల విచారణ పేరిట అమాయకుల్ని వేధించే పోలీసుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇటీవల ఓ మహిళను వేధించినందుకుగాను పోలీసు యంత్రాంగం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ వేధింపుల ఫిర్యాదులతో పలువురిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ షాపు లో చోటు చేసుకున్న వాగ్యుద్ధం చివరకు ఓ యువకుడ్ని బలిగొనేలా చేసింది. చిన్న వివాదాన్ని బూతద్దంలో పెట్టే యత్నం చేసిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ చివరకు ఆ యువకుడిని తన తూటాలకు బలి చేశాడు. తాను హత్య కేసులో ఇరుకున్నారు.
వివాదం : రామనాథపురం జిల్లా తిరువాడనై సమీపంలోని ఎస్‌పీ పట్నంకు చెందిన సయ్యద్ మహ్మద్(22) తన మోటార్ సైకిల్‌ను సర్వీసింగ్ నిమిత్తం అదే ప్రాంతంలోని మెకానిక్ అరుల్ దాసుకు ఇచ్చాడు. మోటార్ సైకిల్‌ను సర్వీసింగ్ అనంతరం తీసుకెళ్లేందుకు వచ్చిన క్రమంలో సయ్యద్ మహ్మద్‌కు అరుల్ దాసుకు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అక్కడున్న వాళ్లు దీన్ని గుర్తించి ఇద్దరికీ నచ్చ చెప్పి పంపించేశారు. అయితే, తనను కత్తితో సయ్యద్ బెదిరించాడంటూ అరుల్ దాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ కాళిదాసు బృందం విచారణ పేరుతో మంగళవారం రాత్రి సయ్యద్‌ను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏమి జరిగిందో ఏమోగానీ , కొన్ని గంటల వ్యవధిలో సయ్యద్ శవమయ్యారు. పోలీసు స్టేషన్లో మూడు రౌండ్లు కాల్పుల శబ్దం రావడంతో ఇన్‌స్పెక్టర్ ఆగ్రహానికి సయ్యద్ బలయ్యాడన్న ప్రచారం వేగం పుంజుకుంది. అదే సమయంలో సయ్యద్ తనను కత్తితో పొడిచాడని, అందుకే తాను ఆత్మరక్షణ నిమిత్తం కాల్పులు జరిపినట్టు కొత్త హైడ్రామాను కాళిదాసు రచించడం ఆ పరిసరాల్లో కలకలాన్ని రేపింది.
రంగంలోకి విచారణ బృందం : ఎస్‌పీ పట్నం పోలీసు స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జిల్లా ఎస్‌పీ మయిల్ వాహనం, ఏఎస్‌పీ నల్ల దురై, డీఎస్పీ శేఖర్‌లు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ఈ ఘటనపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్‌పీ హామీ ఇవ్వడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
మైనారిటీల్లో ఆగ్రహ జ్వాల: ఈ ఘటన బుధవారం ఉదయాన్నే మైనారిటీ సంఘాల్లో ఆగ్రహ జ్వాలను రగిల్చింది. పోలీసుల తీరును నిరసిస్తూ జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు రాజుకున్నాయి. మనిద నేయ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే జవహరుల్లా నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు పోలీసుల చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలకు దిగారుు. నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సయ్యద్‌ను కాల్చి చంపడంతో అతడి తల్లి, సోదరి, సోదరుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తించారు. అతడి తల్లి అంధురాలు కావడంతో తీవ్ర మనోవేదనలో పడ్డ మైనారిటీ సంఘాలు తమ వంతు సహకారం అందించడంతో పాటుగా ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇప్పించడమే లక్ష్యంగా ఆందోళనకు సిద్ధం అయ్యాయి.
ఎస్‌ఐ సస్పెన్షన్: మదురైకు చెందిన ఎస్‌ఐ కాళిదాసు అందరితో దురుసుగా వ్యవహరించే వాడని విచారణలో తేలింది. అలాగే, మదురైలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసి కేసులో ఇరుక్కున్నట్టు తేలింది. అక్కడి నుంచి ఇటీవలే బదిలీ మీదకు ఎస్‌పీ పట్నంకు వచ్చాడు. అతడి చరిత్రను తిరగేసిన అధికారులు, ప్రస్తుతం విచారణ పేరుతో సయ్యద్‌ను కాల్చి చంపి, కత్తితో పొడుచుకుని కాళిదాసు హైడ్రామా సాగించి ఉంటాడన్న భావనలో పడ్డారు. ఈ నేపథ్యంలో కాళి దాసును సస్పెండ్ చేస్తూ ఎస్‌పీ మయిల్ వాహనం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై హత్యా నేరం కేసు నమోదుకు మైనారిటీ సంఘాలు పట్టుబడుతుండడంతో, సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ హామీ ఇచ్చారు.