పేదలను పట్టించుకోని చాయ్‌వాలా బడ్జెట్
సందర్భం
సంపన్నులు మరింత సంపన్నులైతేనే కష్టపడి పని చేస్తారనీ, పేదలు మరింత పేదలైతేనే ఒళ్లొంచుతారనే తప్పుడు ఊహే కీలకంగా ఉన్న మోదీ-జైట్లీల ఆర్థికనీతి ఈ బడ్జెట్‌ను అక్షరాలా తిరోగమనం పట్టిస్తోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన 2015 బడ్జెట్‌పై ఒక మాదిరి ప్రశంస నుంచి కరతాళధ్వనుల వరకు అన్ని రకాల స్పందనలూ వ్యక్త మవుతున్నాయి. సంపన్న వర్గా లకు మాత్రం బడ్జెట్ ఎంతగా నో నచ్చేసింది. కార్పొరేట్ ఆదాయం పన్ను తగ్గింపు, సం పద పన్ను రద్దు, కస్టమ్స్, ఎక్సై జ్ సుంకాల మాఫీ మొదలైన వరాలు సంపన్న వర్గాలను మరింత సంపన్నుల్ని చేయబోతున్నాయి. పేద వర్గాలకు మాత్రం అలాంటి ఉపశమన చర్యలు లోపించడమే కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ పథకాలలో అనేకం యూపీఏ ప్రభుత్వం రూపొందించినవే కాక, సత్ఫలితా లను సాధించినవి.
కీలక సామాజిక పథకాలకు, వాటిని అమలు చేసే మంత్రిత్వశాఖలకు కేటాయింపులలో హఠాత్తుగా భారీ ఎత్తున కోత పెట్టడమే ఈ బడ్జెట్‌లో ప్రముఖంగా కని పించే అంశం. ఉదాహరణకు, మహిళా - శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు 51 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖకు 13 శాతం, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖకు 15 శాతం చొప్పున కోత పెట్టారు. దీనికితోడు స్థానిక స్వపరి పాలనా సంస్థలకు సాధికారికత కల్పించవలసిన అవస రాన్ని బొత్తిగా పట్టించుకోకుండా పంచాయతీరాజ్ మం త్రిత్వశాఖ నిధులకు ఏకంగా 99 శాతం మేరకు కోత పెట్టడం ప్రత్యేకించి దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఇలాగే యూపీఏ పతాక పథకాలకు కత్తెర వేసేశారు. ఆరోగ్య సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల కోసం రూపకల్పన చేసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులను 18 శాతం మేరకు, గ్రామీణ పేదల కోసం గృహనిర్మాణానికి ఉద్దేశించిన ఇందిరా ఆవాస్ యోజన నిధులను దాదాపు 40 శాతం మేరకు తగ్గించివేశారు. ఇవి పేదల జీవనంలోనే మార్పు తెచ్చి అత్యుత్తమ ఫలితాలను అందించగలిగాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎంనే తీసుకుంటే, ప్రసూతి మరణాలను తగ్గించడం, మారుమూల ప్రాంతాలకు కూడా మందు లను అందుబాటులోకి తెచ్చే వ్యవస్థలను అభివృద్ధి చేయడం వగైరాల రూపంలో ఈ పథకం వివిధ ఆరోగ్య సూచికలను గణనీయంగా మెరుగుపరచింది. ఇందిరా ఆవాస్ యోజన కింద అందించిన ఆర్థిక సాయంతో 1985 నుంచి మొదలు పెట్టి 2 కోట్ల 50 లక్షలకు పైగా గృహ నిర్మాణం జరిగింది. ఈ పథకాలకు మరిన్ని నిధు లు సమకూర్చవలసింది పోయి, వీటిని కుంటుపడేలా చేశారు.
ప్రత్యేకించి రెండు ఉదాహరణలు పేదల పట్ల బీజేపీ అలక్ష్యాన్ని మరింత దిగ్భ్రాంతికరంగా చాటిచెబు తున్నాయి. అవి, విద్య, ఉపాధికల్పన రంగాలు. ప్రాథ మిక విద్యను సార్వత్రికం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)కు కేటాయింపును గత సంవత్సరంతో పోల్చితే 22 శాతం తగ్గించివేశారు. అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వదలక రూ.4,315 కోట్ల మేరకు దాని నిధుల్ని తగ్గించి వేశారు.
గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పన కోసం చేపట్టిన మరో పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్, ఈజీఏ). ఈ పథకా నికి బీజేపీ ప్రభుత్వం రూ.34,699 కోట్లు మాత్రమే కేటా యించి చేతులు దులుపుకోవడం నిర్ఘాంతపరచే విష యం. పైగా, గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ఈ పథకానికి రూ. 699 కోట్లు ఎక్కువ కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ వాస్తవం ఏమిటంటే, 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేటాయిం పు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.8 శాతం ఉంటే, 2015-16 ఆర్థిక సంవత్సరంలో అది 0.3 శాతానికి తగ్గి పోయింది. ఈ పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇం కో నిదర్శనం చూడండి- ప్రధానంగా సంపన్న వర్గాల దగ్గరే ఉండే బంగారు, వజ్రాలు, నగలపై కస్టమ్స్ సుం కాన్ని ఏకంగా రూ.75,592 కోట్ల మేరకు మాఫీ చేసే సింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి చేసిన కేటా యింపు కన్నా ఇది రెట్టింపుకు పైగా ఎక్కువ. దేశంలోని ప్రతి నాలుగు కుటుంబాలలోనూ ఒకరికి ఉపాధి కల్పిం చడం, 10.75 కోట్ల మంది క్రియాశీల లబ్ధిదారులను కలిగి ఉండటం, ఒక్క 2013-14 సంవత్సరంలోనే 46.6 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించడం వగైరాల రూపంలో ప్రత్యక్ష ఫలితాలను సాధించిన ఈ పథకం పట్ల ఇదీ ప్రభుత్వ నిర్వాకం.
సంపన్నులు మరింత సంపన్నులైతేనే కష్టపడి పని చేస్తారనీ, పేదలు మరింత పేదలైతేనే ఒళ్లొంచుతారనే తప్పుడు ఊహే కీలకంగా ఉన్న మోదీ-జైట్లీ ఆర్థికనీతి ఈ బడ్జెట్‌ను అక్షరాలా తిరోగమనం పట్టిస్తోంది. 1980 దశకంలో ఈ విధానాన్ని అమలు చేసిన ఫలితంగా అమెరికాలో 3.3 శాతం, బ్రిటన్‌లో 9 శాతం మేరకు పేద రికం పెరిగింది. దీనికి భిన్నంగా సామాజిక వ్యయాన్ని గణనీయంగా పెంచడం వల్ల పేదరికం బాగా తగ్గిందని ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధారాలు సూచిస్తున్నాయి. మన దేశాన్నే తీసుకుంటే, యూపీఏ ప్రభుత్వం చేసిన సామాజిక వ్యయం కారణంగా, 2004లో 37.2 శాతం ఉన్న పేదరికం 2012 నాటికి 22 శాతానికి తగ్గింది.
ఏ ప్రభుత్వ పథకమూ పరిపూర్ణం కాదన్న సంగ తినీ ఒప్పుకోవలసిందే. ఎప్పటికప్పుడు మెరుగుపరచే అవకాశాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఖర్చు తగ్గించి విలువను పెంపొందించే మార్గాలు కూడా ఉంటాయి. ఈ పథకాల రూపకల్పన వెనుక అసలు లక్ష్యం ఏమిట న్నది గుర్తు పెట్టుకోవడమూ అంతే ముఖ్యం. వాటిని కల్పించినది పేద వర్గాల మెరుగైన జీవనానికి తోడ్పడే కీలక సాయం అందించడానికే కానీ లాభాలు తెచ్చి పెట్ట డానికి కాదు. లక్షలాది మంది ఆధారపడే ప్రభుత్వ పథ కాలను పవిత్ర వృథా వ్యయంగా భావించడం ద్వారా పేదలకు సహాయ సంపత్తులు అందించడం పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఆసక్తి లేదన్న సంకేతాన్ని బడ్జెట్ ఇస్తోంది.
(వ్యాసకర్త ఏఐసీసీ, ఎస్‌సీ విభాగం అధిపతి)
email: krajuindia1981@gmail.com
కొప్పుల రాజు