బూటకపు పత్రాలతో భార్య హక్కుల బలి | Husband tried to cheating of wife rights | Sakshi
Sakshi News home page

బూటకపు పత్రాలతో భార్య హక్కుల బలి

Published Fri, May 22 2015 12:32 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

బూటకపు పత్రాలతో భార్య హక్కుల బలి - Sakshi

బూటకపు పత్రాలతో భార్య హక్కుల బలి

జీవితాలు చూడకుండా కాగితాల మీద దొరికే న్యాయసూత్రాలకు అనుగుణంగా అతనికి సహాయం దొరికింది. ఒక్క సర్టిఫికెట్‌తో రెండు విజయాలు సాధించాడా భర్త. ఒకటి- ప్రభుత్వ సొమ్ముతో భార్యపైన కోర్టులో సమరం సాగించడం. రెండు- భార్యకు జీవనభృతి ఇవ్వాలనే న్యాయానికి గొడ్డలి వేటు వేసి, ఆ భార్యే తనకు భృతి ఇవ్వాలనే దారుణానికి ఆధారం సంపాదించడం.
 
 లంచాలు ఇచ్చి తీసుకున్న దొంగ సర్టిఫికెట్లు రాజ్యాంగం, చట్టాలూ ఇచ్చిన హక్కులను కూడా నాశనం చేస్తాయి. ఒక యువతి (సఖి) తన సహో ద్యోగిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నది. మతం అడ్డొచ్చినా ఆమె వెనుదీయలేదు. పెళ్లికీ, ప్రేమకూ షరతులు ఉండవు. ఉండకూడదు. ఉంటే మానవ సంబంధాలను స్వార్థానికి వాడుకున్నట్టే. ఇది తెలియని ఆ అమాయకురాలు తమది నిజమైన ప్రేమ అని భ్రమించింది. మతం మారాలన్న షరతును అంగీకరించింది. మతం మారా లన్న నిబంధన విధించడమే అతని స్వార్థమని ఆలో చించలేకపోవడం వల్ల ఆ యువతి వివాహ జీవితం దెబ్బతిన్నది. ఇదంతా తెలిసేలోపున కూతురు పుట్టింది.
 
 కుటుంబ హింస మొదలైంది. విడిపోక తప్పని పరిస్థి తులు తలెత్తాయి. అతడి కోసం కుటుంబాన్నీ, మతాన్నీ వదులుకున్న మహిళ ఒంటరిదైపోయింది. తన జీతం చాలదనీ, తనకూ, కూతురుకూ జీవనభృతి ఇవ్వాలనీ ఆమె కేసు వేసి, 498 ఎ కింద ఫిర్యాదు చేసింది. అలాగే అటువైపు నుంచి ఆమె భర్త, నెలకు రూ. 70,000 సంపా దించే ఉద్యోగం పోయిందని నమ్మబలికాడనీ, ఏ ఆదా యం లేదని అబద్ధం సృష్టించాడనీ, రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చి ఏడాది ఆదాయం రూ.70,000 కు మించి లేదని వెల్లడించే సర్టిఫికెట్ సంపాదించాడనీ ఆమె ఆరోపించారు.
 
 ఈ ధ్రువీకరణ ఆధారంగా ఆ ‘నిరుపేద’ భర్త కోర్టు లో న్యాయసేవా సహాయ సంస్థ నుంచి లీగల్ ఎయిడ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. జీవితాలు చూడకుండా కాగి తాల మీద దొరికే న్యాయసూత్రాలకు అనుగుణంగా అత నికి సహాయం దొరికింది. భార్య మీద న్యాయపోరాటం చేయడానికి న్యాయసేవ అతనికి సాయం చేసింది. ఒక్క సర్టిఫికెట్‌తో రెండు విజయాలు సాధించాడా భర్త. ఒకటి- ప్రభుత్వ సొమ్ముతో భార్యపైన కోర్టులో సమరం సాగించడం. రెండు- భార్యకు జీవన భృతి ఇవ్వాలనే న్యాయానికి గొడ్డలి వేటు వేసి, ఆ భార్యే తనకు భృతి ఇవ్వాలనే దారుణానికి ఆధారం సంపాదించడం.
 
 ఈ అన్యాయాల పరంపరతో సఖి నిర్ఘాంతపో యింది. అయినా ధైర్యంగా సమాచార హక్కు చట్టం కింద మరో పోరాటం ప్రారంభించింది. నెలకు రూ. 48,000 సంపాదించే తన భర్తకు ఏడాదికి రూ. 70,000 ఆదాయమే వస్తున్నదని చెప్పే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆధారంగా ఉన్న పత్రాల ప్రతులను కోరింది. రెవెన్యూ పీఐఓ తన వద్ద ఆ సమాచారం లేదన్నాడు. మొదటి అప్పీలు దాఖలు చేసిందామె. పది రోజులలో పూర్తి సమాచారం ఇవ్వాలని పీఐఓను ఆదేశించారు ఆ సీని యర్ అధికారి. గడువు పూర్తయింది. కానీ ఏ సమా చారమూ రాలేదు. రెండో అప్పీలును కేంద్ర సమాచార కమిషన్ ముందు దాఖలు చేసిందామె. పెండింగ్ కేసుల భారం వల్ల భారీ ఆలస్యం తరువాత కేసు విచారణకు వచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన వ్యవ సాయ ఈవో ఏఎన్ మిశ్రా అతడి ఫైలు పోయిందని చెప్పాడు. మిశ్రాను పీఐఓగా పరిగణించి జరిమానా ఎం దుకు విధించకూడదో, నష్ట పరిహారం ఎందుకు ఇవ్వ కూడదో వచ్చి వివరించాలని నేను ఆదేశించాను. ఫైలు పోయిందని వాదించిన మిశ్రా, తరువాత ఫైలు దొరి కిందని చెబుతూ, భర్త దరఖాస్తును, బ్యాంక్ ఖాతా ప్రతిని ఇచ్చారు.
 
 ఇవేనా అతని ఆదాయం నిర్ధారించే అధారాలు? ఇంకేమైనా ఉన్నాయా? అని అడిగితే; అం దుకు మిశ్రా ఇరుగు పొరుగును విచారించిన తరువాత ఆదాయాన్ని ధ్రువీకరించానని సమాధానం చెప్పారు. ఆ విచారణకు సంబంధించిన కాగితాలు ఏవని అడిగితే, అవీ దొరకడం లేదని చెప్పాడు. తన భర్త జీవన విధానం గురించీ, అంతకు ముందు ఏ విధంగా ఖర్చు చేసేవారు అనే అంశాలు తెలుసుకుంటే, సరిగ్గా విచారించి ఉంటే నిజమైన ఆదాయ వివరాలు బయటపడి ఉండేవని సఖి వాదించారు. ఒక పద్ధతీ, క్రమం లేకుండా అతడు చెప్పి న మేరకే ఆదాయం ఉందని ధ్రువీకరించడం అవినీతే అవుతుందని కూడా వాదించారు.
 
 ఈ వాదోపవాదాల న్నింటినీ పరిశీలించాక, మిశ్రా వివరణను చూశాక, మిశ్రా సకాలంలో సమాచారం ఇవ్వకుండా ఆమె హక్కు కు భంగం కలిగించారని స్పష్టమవుతుంది. ఆలస్యం, నిరాకరణ, తప్పుడు సమాచారం, అసం పూర్ణ సమాచారం వంటి తప్పులకు పాల్పడిన మిశ్రా పైన రూ. 25,000 జరిమానా విధించాలని ఆర్టీఐ చట్టం నిర్దేశిస్తున్నది. కనుక జరిమానా విధించడమే కాకుండా, సఖికి రూ. 10,000 నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ శాఖను కూడా ఆదేశించారు. ఇది క్రిమినల్ నేరమనీ, కాబట్టి మరింత పరిశోధించి బాధ్యులను ప్రాసిక్యూట్ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలనీ నేను ఆదేశిం చాను. బూటకపు ఆదాయ సర్టిఫికెట్ తయారుచేయడం నేరం. ఈ నేరం మరిన్ని నేరాలకు కారణమవుతుంది. ఎన్నో హక్కులకు భంగం వాటిల్లచేస్తుంది. ఆ నేరాలను అరికట్టే అస్త్రం ఆర్టీఐ చట్టమేనని సఖి నిరూపించింది.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 మాడభూషి శ్రీధర్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement