ఆది నుంచీ అతిక్రమణలే!
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్
‘పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను ఆర్థిక బిల్లుగా పరిగణించక తప్పదని ప్రభుత్వ అటార్నీ జనరల్ వాహనవతి కూడా సలహా ఇవ్వడంతో మంత్రులూ, అధికారపక్ష లెజిస్లేటర్లూ కళ్లు తెరచుకోవలసి వచ్చింది. బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ కూడా ‘ఇలాంటి బిల్లును ఇంతకుముందెన్నడూ చూడలే’దన్నారు.
‘‘కార్యనిర్వాహక అధికారం అంటే ఏమిటో మన రాజ్యాం గంలో నిర్వచించలేదు. అయినా, కార్యనిర్వాహక వర్గ అధికార విస్తరణ, ఆ అధికారం పంపిణీ కావలసిన పద్ధతి గురించీ రాజ్యాం గంలోని 73వ, 163వ అధికరణలు ప్రస్తావించాయి. భారత సమాఖ్య ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతి చెలాయి స్తారు. అయితే ఈ అధికారాన్ని ఆయన ప్రత్యక్షంగా గాని లేదా తన అధికారానికి లోబడి ఉన్న అధికారుల ద్వారా గానీ భారత రాజ్యాంగానికి బద్ధమై చెలాయిస్తారు. ఈ చివరి ఐదు మాటలూ, రాజ్యాంగంలోని ‘అధికరణ 53(1)’ ప్రకారం రాష్ట్రపతి చర్యలను నియంత్రించడానికి లేదా అదుపుచేయడానికి కీలకమైన అంశాలు. రాజ్యాంగానికి లోబడని కార్యనిర్వాహక అధికారాన్ని న్యాయస్థా నాలు తోసిపుచ్చుతాయి. అందువల్ల రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకా రమే ఎన్నికైన పౌరుడైనా సరే రాజ్యాంగ నిబంధనలకు బద్ధుడై ఉండవలసిందే. ఎందుకంటే, రాజ్యాంగాన్ని కాపాడతాననీ, రక్షిస్తాననీ, సమర్థిస్తాననీ అధికరణ 60 ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు గనుక!’’
- డాక్టర్ కేఎస్ చౌహాన్, సుప్రీంకోర్టు న్యాయవాది: ‘పార్లమెంట్ - పవర్స్ ఫంక్షన్ అండ్ ప్రివిలేజెస్’’ పే: 38: లెక్సిస్ నెక్సిస్
‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు’ పేరుతో యూపీఏ రాజ్యాంగ నిబంధనలన్నింటినీ గాలికి వదిలేసి ముందుకు సాగుతూనే ఉంది. చివరికి రాష్ర్టపతిని కూడా రంగంలోకి దించి మరిన్ని ఉల్లంఘనలకు తెరలేపుతూ తప్పుల మీద తప్పు చేయడానికి కూడా కాంగ్రెస్ జంకడం లేదు! వ్యవస్థ పరిరక్షణకు తగిన శాసనాలు చేయమని ప్రజలు ఓట్లేసి ప్రతినిధులను పంపారు. కానీ మన చట్టసభల సభ్యులూ, మంత్రులూ, ప్రధానమంత్రులూ, వారి వెనకనున్న నిర్వాహకులూ రాజ్యాంగమూ, దాని అధికరణలూ తెలియకుండానే పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్నందుకు ప్రజలు తలలు దించుకోవలసిన దుర్గతీ, దుస్థితీ ఏర్పడింది. రాజ్యాంగం ప్రకారం ఏ బిల్లును ఏ సభలో (రాజ్యసభ- లోక్ సభల్లో) ముందు ప్రవేశపెట్టాలి? ఏ రాజ్యాంగ సవరణను ఏ బిల్లుకు ఎలా ప్రతిపాదించి ప్రవేశపెట్టాలి? బిల్లు ఆమోదానికి ఎన్ని రీడింగ్స్‌ను సభ నిర్వహించాల్సి వస్తుంది? ఏ బిల్లును సభ స్థాయీసంఘం పరిశీలనకు పంపాలి? అసలు ఒక ముసాయిదా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు, ఆమోదానికి పంపే ముందు తరచి చూడవలసిన ఆనుపానులేమిటి? ద్రవ్యబిల్లా లేక సాధారణ బిల్లా? ఇవన్నీ శాసనకర్తలూ, మంత్రులూ తెలుసుకునే ఉంటారని అనుకుంటాం. కాని ప్రజల విశ్వాసాన్ని లెజిస్టేటర్లు, ప్రసిద్ధ న్యాయవాదులుగా చలామణీ అయ్యి, ఇప్పుడు కేంద్రంలో సీనియర్ మంత్రులుగా పదవులు వెలగబెడుతున్న వారు సహా ఆబ కొద్దీ ఆంధ్రప్రదేశ్ విభజన పని తొందరలో రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించడంలో పప్పులో కాలేశారు!
రాష్ట్రపతినీ మోసగించారు
రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి తగని మనీ బిల్లునే (విభజన పేరిట) రాష్ట్రపతికి కూడా పంపించి ఆయననూ యూపీఏ మోసగించింది. రాజ్యసభ చైర్మన్ అన్సారీ తప్ప, రాష్ట్రపతి సహా అందరూ ఈ అంశంలో పక్కతోవలు పట్టిన వారే. అందుకు అన్సారీ అభినందనీయులు. రాష్ట్ర విభజన రూపంలో ‘మనీ బిల్లు’(ద్రవ్యబిల్లు) రాజ్యసభకు రాకూడదనీ, లోక్‌సభలో ప్రవేశపెట్టి, అక్కడ అనుమతి పొందిన తర్వాత తగులు, మిగులు సిఫారసుల కోసం మాత్రమే రాజ్యసభకు లోక్‌సభ నివేదిస్తుందన్న పరిజ్ఞానం అన్సారీకి ఉంది. దీనితోనే న్యాయశాఖ అధికారులకు, నిపుణులకు ఈ అంశాన్ని నివేదించాల్సివచ్చింది. ఆ పిమ్మట ‘పునర్వ్యవస్థీకరణ (2013) బిల్లు’ను ఆర్థిక బిల్లుగా పరిగణించక తప్పదని ప్రభుత్వ అటార్నీ జనరల్ వాహనవతి కూడా సలహా ఇవ్వడంతో మంత్రులూ, అధికారపక్ష లెజిస్లేటర్లూ కళ్లు తెరచుకోవలసివచ్చింది. బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ కూడా ‘ఇలాంటి బిల్లును ఇంతకుముందెన్నడూ చూడలే’దన్నారు.
ఆర్థికబిల్లు అయినా....
‘ఆర్థిక బిల్లు’, దాని స్వరూప స్వభావాలు ఏమిటో రాజ్యాంగంలోని 110వ, 117వ అధికరణలు పేర్కొన్నాయి! ‘మనీ బిల్లు’లో ఉన్న సంచిత నిధి (కన్సా లిడేట్ ఫండ్) నుంచే విభజన ఫలితంగా ఉత్పన్నమయ్యే లావాదేవీల్లో భాగంగా ప్రభుత్వం డబ్బులు ‘డ్రా’ చేసి వినియోగించుకోవాలి. ఆ ఆర్థిక విషయాలు ఆ బిల్లులో ఉండబట్టే రాజ్యసభలో ముఖం చాటేయవలసివచ్చిందని గుర్తించాలి! ‘విభజన’ అవసరమేదో, ఎవరి వల్ల సమస్య ఉత్పన్నమైందో ప్రకటించాల్సిన ఈ బిల్లు, లక్ష్య నిర్వచనంతో పాటు, కారణాలు పేర్కొనడం లోనూ విఫలమైంది. ఏ బిల్లుకైనా, ప్రతిపాదనకైనా, ప్రకటనకైనా - నిర్వచనం, వివరణ అవసరం. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుకు ఉపోద్ఘాతం ఉండాలి. బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందే గెజిట్ ప్రకటన విధిగా చేయాలని, అలాగే సభ్యులకు రెండు రోజుల ముందే బిల్లు కాపీలను అధ్యయనం చేసుకోవడానికి అందిం చాలన్న రాజ్యాంగ నిబంధనను కూడా పాటించని మూర్ఖులు ఈ పాలకులు! విభజన బిల్లును ఈ ప్రక్రియ నుంచి కూడా ఈసారి తప్పించేయడానికి పాల కులు కుట్రపన్నుతున్నారు. అందుకే ఉభయసభల సంయుక్త (జాయింట్) సంఘానికి గానీ, సెలెక్ట్ కమిటీకి గానీ బిల్లును నివేదించే సంప్రదాయాన్నీ ఉల్లంఘించేందుకు వెనుకాడటం లేదు.
వీటో అధికారం లేదా!
రాష్ట్రపతి ప్రణబ్‌కి బెంగాల్ విభజన (1905) నాటి అల్లకల్లోల పరిస్థితులు తెలుసు. అయినా ‘చిన్న రాష్ట్రాల’ పేరిట స్థిరపడిన భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కూడా విభజించడానికి ఉద్దేశించిన తప్పుడు బిల్లుకు అభ్యంతరం తెలపగల అధికారాన్ని రాజ్యాంగం కల్పించినా వినియోగించకపోవడం ఎంత చిత్రం? ఒక పెద్ద రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన బిల్లుకు, 9072 సవరణలతో, సూచనలతో అభిప్రాయాలతో కూడిన బిల్లును ‘చిటికె’లో సమ్మతి తెలపడాన్ని కోర్టులో ప్రశ్నించవచ్చు. 1970లో సుప్రీంకోర్టు ఇలాంటి ఒక కేసులో చెప్పిన తీర్పులో (ఆర్‌సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో) అభి ప్రాయపడిందని మరవరాదు! అక్కడికీ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి విశేషాధికారంలో భాగంగా మూడు రకాల ‘వీటో’ (అభ్యంతరం చెప్పే) ప్రయోగించిన హక్కు ఉంది. ఆ మూడు రకాల ‘వీటో’లు -
పూర్తి ‘యాబ్‌సల్యూట్’ వీటో! పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు సమ్మతి తెలపకుండా ఉండే ‘వీటో’ ఇది.
బిల్లును తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచుతూ తిరిగి పార్లమెంటు పరిశీలిం చడానికి అనువుగా నిర్ణయించే ‘సస్పెన్సివ్ వీటో’.
‘పాకెట్ వీటో’. అంటే బిల్లును రాష్ట్రపతి ధ్రువీకరించకుండా లేదా తిరస్క రించకుండానూ లేదా బిల్లును తిప్పి పంపకుండానూ తన వద్దనే నిరవ ధికంగా ఉంచేసుకోవడం! రాష్ట్రపతి ఈ ‘పాకెట్ వీటో’ను కూడా, రాజ్యాంగ బద్ధంగా కూడా వినియోగించుకోలేకపోయారు. ఇదే ‘వీటో’ అధికారాన్ని 1986లో మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్ వినియోగించుకున్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి.
చరిత్రహీనమైన కాంగ్రెస్
ఒక ఏక భాషా రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉందా లేదా అని తాజాగా (11.2.2014) కేంద్ర న్యాయశాఖ నిపుణుల అభిప్రాయాన్ని లోక్‌సభ సచివాల యం అడిగిందని తెలుస్తోంది! ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని కూడా విభజించవలసి ఉన్నందున, రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయ నిపుణులం తా మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పట్టించుకునే స్థితిలో లేదు! 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ చరిత్రహీనురాలు కావడానికి 125 సెకండ్లు కూడా పట్టని ‘రాస్తా’లో నేడు ప్రయాణిస్తోంది! అందుకే అన్నారు ‘ఏళ్లు ఎగసన, బుద్ధి దిగసన’ అని. తెలుగువారంతా అప్రమత్తులై ఉండాలి!! ఓ కొసమెరుపు -బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు సారథ్యం వహిస్తున్న పార్లమెంటు స్థాయీసంఘానికి స్పీకర్ బిల్లును పంపవచ్చు! కారణం-తేటతెల్లం! ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువ!
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)