అనంతపురం,హిందూపురం పార్లమెంట్ స్థానానికి దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ వీరపాండియన్, చిత్రంలో అభ్యర్థులు జాయింట్ కలెక్టర్ డిల్లీరావు
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా... ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం పొందాయి. నలుగురి నామినేషన్లను తిరస్కరించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 12 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 9 మంది నామినేషన్లు ఆమోదించారు. ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు.
ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 190 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 64 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా నామినేషన్లు తిరస్కరణకు గురైన నియోజకవర్గాలో ధర్మవరం మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో పుట్టపర్తి ఉంది. ధర్మవరం నియోజకవర్గానికి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 ఆమోదం పొందాయి. 15 తిరస్కరణకు గురయ్యాయి. ఇక పుట్టపర్తి నియోజకవర్గానికి 28 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 21 ఆమోదం పొంది, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఆమోదం పొందిన ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు
అనంతపురం పార్లమెంట్: తలారి రంగయ్య (వైఎస్సార్‌సీపీ), జేసీ పవన్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ), కె.రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్), జి.లలిత (ఎస్‌యుసీఐ)
హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్‌సీపీ), నిమ్మల కిష్టప్ప (టీడీపీ), ఎం.ఎస్.పార్థసారథి (బీజేపీ), కె.టి.శ్రీధర్ (కాంగ్రెస్)
పార్లమెంట్ | ఆమోదం | తిరస్కరణ | మొత్తం |
అనంతపురం | 14 | 4 | 18 |
హిందూపురం | 9 | 3 | 12 |
- 14 అసెంబ్లీ స్థానాలకు 190 ఆమోదం, 64 తిరస్కరణ
నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ
అనంతపురం అర్బన్: నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారంతో ముగియగా...ఉపసంహరణకు 28వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో ఉపసంహరణ ప్రక్రియ బుధు, గురువారాలు కొనసాగనుంది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 30 మంది నామినేషన్ వేయగా, 23 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. అదే విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది నామినేషన్లు వేయగా 190 ఆమోదం పొందాయి. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారో...? ఎంత మంది బరిలో ఉంటారో 28వ తేదీన తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment