సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. తెలంగాణకు దక్షిణ భాగంలోని జోగుళాంబ ఆలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ఆ పార్టీ ముఖ్య నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. శనివారం గాంధీభవన్‌లో చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు, సరళిపై రెండు గంటలకు పైగా సభ్యులు చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి ఎన్నికల ప్రచారం ఆలంపూర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించే సెంటిమెంట్‌ను వదులుకోవాలా.. వద్దా.. అనే దానిపై తర్జనభర్జనలు జరిగిన అనంతరం మరో సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి సభ్యులు వచ్చినట్లు తెలిసింది. అయితే, దాదాపు జోగుళాంబ నుంచే పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
20–25 వేల సమీకరణలతో సభలు...
భారీ ఎత్తున ఒకే చోటకు జనాలను తరలించి బహిరంగ సభలు నిర్వహించడంతో తాము చెప్పాలనుకున్నది ప్రజల్లోకి సరిగా వెళ్లే అవకాశం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని, ఆ సభలకు 20–25 వేల మందిని సమీకరించి తాము చెప్పాలనుకున్నది చెప్పాలని నిర్ణయిం చారు. దీనికోసం వరుసగా 30 రోజుల షెడ్యూల్‌ను కాంగ్రెస్ నేతలు తయారుచేస్తున్నారు. రోజుకు 3 సభల చొప్పున మొత్తం 90 సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణను 4 భాగాలుగా విభజించి సోనియా, రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనే అంశంపై కూడా కమిటీలో చర్చ జరిగింది. మధ్య, ఉత్తర, దక్షిణ తెలంగాణలతో పాటు తెలంగాణ మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ నాలుగు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. సభలు, సమావేశాలతో పాటు షార్ట్‌ఫిల్మ్‌లు, సోషల్ మీడి యా, పోస్టర్లు, కరపత్రాలు, ఎల్‌ఈడీ స్క్రీన్ వాహనా లు, కళాబృందాల ద్వారా విస్తృత ప్రచారం చేయా లని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెలి కాప్టర్లలో వెళ్లి ప్రచారం నిర్వహిస్తే.. తాము కార్లలో, రోడ్డు మీద ప్రచారానికి వెళ్లడం సరైంది కాదని, రోజుకు 3 చొప్పున జరిగే బహిరంగ సభలకు హాజరయ్యేందుకు ఒక హెలికాప్టర్‌ను తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలు అందులో సమావేశాలకు వెళ్లాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.
కౌంటర్ నినాదం కావాలి..
‘బంగారు తెలంగాణ’పేరుతో ప్రజల్లోకి వెళుతున్న టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవాలంటే ఆ బంగారు తెలంగాణ నినాదానికి కౌంటర్ నినాదం తయారు చేయాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఆత్మగౌరవ తెలంగాణ, స్వాభిమాన తెలంగాణ, స్వేచ్ఛా తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ లాంటి పేర్లను పరిశీలించి సింగిల్ కాన్సెప్ట్ నినాదాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీంతో పాటు గతంలో బహిరంగ సభలు, మేనిఫెస్టో ప్రచారంలో విఫలమయ్యాయని, అది పునరావృతం కాకుండా ఈసారి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా సుత్తిలేకుండా, సూటిగా ఉండే ఎన్నికల నినాదాలను రూపొందించాలని కూడా నిర్ణయించారు.
అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్ పెంపు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌తో సంబం ధం లేకుండా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వేషన్లు పెంచే యోచనలో ఆ పార్టీ ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని, ఈ రిజర్వేషన్ల పెంపు అంశానికి తొమ్మిదో షెడ్యూల్‌తో సంబంధం లేదని, రాష్ట్రంలో గిరిజన జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తోంది. శనివా రం ఈ మేరకు గాంధీభవన్‌లో చైర్మన్ వి.హనుమంతరావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వ్యూహ, ప్రణాళిక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో రిజ ర్వేషన్లు అమల్లోకి తెచ్చేలా ప్రయత్నించాలని, రాష్ట్రం లోని బీసీలు, మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచే లా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండల్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా ప్రభుత్వ ఉద్యోగా ల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు కావాలని, వాస్తవానికి 9% కూడా భర్తీ కావడం లేదని గుర్తించారు. బీసీల క్రీమీలేయర్ అం శాన్ని పునఃపరిశీలించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా మేనిఫెస్టో కమిటీకి సిఫార్సు చేయా లని నిర్ణయించారు. దీనికి తోడు బీసీ, మైనార్టీలకు కూడా ఎస్సీ, ఎస్టీల తరహాలో సబ్‌ప్లాన్ అమల్లోకి తేవాలని మేనిఫెస్టో కమిటీకి సిఫారసు చేయాలని నిర్ణయించారు.
4 రోజుల తర్వాత చించేస్తాం: వీహెచ్
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు, వరాల హామీలపై హోర్డింగులను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉంచారని, వాటిని 4 రోజుల్లో తొలగించకపో తే కాంగ్రెస్ కార్యకర్తలే చించివేస్తారని వీహెచ్ హెచ్చరించారు. వ్యూహ, ఎన్నికల ప్రణాళిక కమిటీ అనంతరం కన్వీనర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సభ్యులు మల్లు రవి, జీవన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, నగేశ్ ముదిరాజ్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు.
జిల్లా కమిటీలు సమాచారమివ్వాలి..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి దుర్వినియోగం జరిగినా జిల్లా కాంగ్రెస్ కమిటీలు టీపీసీసీకి తెలియజేయాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి సమాచారం సేకరించాలని, అధికార దుర్వినియోగాన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడే అడ్డుకోవాలని కోరా రు. మల్లు రవి, నాగం మాట్లాడుతూ, తెలంగాణను కేసీఆర్ ఆగమాగం చేశారని, పాలనా వ్య వస్థను ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment