‘నోటా’ ఇద్దరు అభ్యర్థుల ‘గెలుపు’తో దోబూచులాడింది. ఈ చెల్లని ఓటు నాడు బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గుబులు పుట్టించింది. గత ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవంతో ఈసారి ఓట్లు ‘నోటా’కు పోకుండా అభ్యర్థులు ప్రత్యేక ప్రచారం కూడా చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చనప్పుడు ఓటర్లు ‘నో’ చెప్పే ఆయుధం నోటా (నన్ ఆఫ్‌ది అబవ్). ఈ ఓటు గత సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుర్తి, చేవెళ్ల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలలో ఈ ఆప్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇలా ప్రవేశపెట్టిన తొలి ఫలితాల్లోనే నోటా దెబ్బ ఎలా ఉంటుందో జిల్లాలో ఇద్దరు అభ్యర్థులకు తెలిసివచ్చింది. 2014లో నోటాకు నమోదైన ఓట్లకంటే స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే రెండు కాగా.. ఆ రెండూ రంగారెడ్డి జిల్లాలోనివే కావడం విశేషం. కల్వకుర్తి, చేవెళ్ల శాసనసభ స్థానాల్లో ఓటరు తీర్పులో నోటాయే కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1,52,160 మంది ఓటర్లు ‘నోటా’ నొక్కగా.. రంగారెడ్డి జిల్లాలో 11,019 మంది ఈ మీటకు ఓటేశారు.
భయపెడుతోంది..
ఎన్నికల్లో ‘నోటా’కు చాలా ప్రాధాన్యం ఉంది. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల గెలిచిన అభ్యర్థుల అధిక్యత కన్నా, ఈ ఓట్లదే పైచేయిగా కనిపించింది. అలా నోటాకు పోలయిన ఓట్లలో కొన్ని తమకు పడినా గెలిచే వాళ్లమన్న బెంగ పరాజితులను వెంటాడింది. అత్యల్ప ఓట్లతో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. మెజార్టీ ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో నోటాకు పడడం వారిని కుంగదీసింది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్న నోటా.. ప్రస్తుత ఎన్నికల్లోను అభ్యర్థులను దిగాలు పడేలా చేస్తోంది. ఓటు విలువే కాదు.. నోటాకు వేస్తే ఎదురయ్యే పరిణామాలపైనా ఓటర్లను చైతన్య పరచాలని పార్టీ శ్రేణులను అభ్యర్థులు పురమాయిస్తున్నారు. ముఖ్యంగా త్రిముఖ, చతుర్ముఖ పోటీలు ఉండే నియోజకవర్గాల్లో ప్రతి ఓటు విలువైనదే. దీంతో అలాంటి వాతావరణంలో ఉన్న నియోజకవర్గాలలో ఓటర్లు ‘నోటా’కు ఓటు వేయకుండా వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు.
కల్వకుర్తిలో పరేషాన్
కల్వకుర్తి సెగ్మెంట్‌లో చివరి రౌండ్ వరకు కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన లెక్కింపులో ఆఖరికి విజయం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డినే వరించింది. విశేషమంటే.. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. వంశీచంద్‌రెడ్డి మెజార్టీ కేవలం 78 ఓట్లు మాత్రమే. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు 1,140. ఈ ఓట్లు గనుక ఇరువురు అభ్యర్థులెవరికైనా పడి ఉంటే తీర్పు ఇంకోలా ఉండేది. వంశీకి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఆచారికి 42,704 ఓట్లు లభించాయి.
చేవెళ్లలోనూ అదే సీన్..
చేవెళ్ల నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగా సాగింది. 2009 ఎన్నికలలోనూ గెలుపొటములను తక్కువ ఓట్లే ప్రభావితం చేయగా.. 2014 ఎన్నికలలో కూడా విజేత అత్యల్ప ఓట్ల మెజార్టీతో గెలిచి.. హమ్మయ్యా అనుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య విజేతగా నిలిచిన గత ఎన్నికల్లో ఆయనకు లభించిన అధిక్యం 781 ఓట్లు. ఇక్కడ నోటాకు పడ్డ ఓట్లు 1,229. యాదయ్యకు 64,182 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంకు 63,401 ఓట్లు దక్కాయి. నోటా ఓట్ల ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ఫలితమిది.
...::: డి.వెంకటేశ్వరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment