న్యూఢిల్లీ: గుజరాత్‌లో ముస్లిం ప్రాధాన్యం పెరుగుతోందనడానికి అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలే నిదర్శనమని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారతీరుపై మాట్లాడుతూ ఇద్దరూ ఒకే తాను ముక్కలని పేర్కొన్నారు. ఓటర్లను చేరుకునేందుకు వీరిద్దరూ ఒక మందిరం నుంచి మరొక మందిరానికి వెళ్లారని గుర్తు చేశారు. 'బీజేపీని ఓడించాలంటే బీజేపీలా మారిన మరో పార్టీ వల్ల కాదు. మనకు, బీజేపీకి బేధం చూపించాల’ని అన్నారు. గుజరాత్‌లో బీజేపీని ఓడించే అవకాశం కాంగ్రెస్‌కు వచ్చిందని, కానీ హస్తం పార్టీ విఫలమైందని అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో కాషాయ పార్టీని ఓడించాలంటే ప్రతిపక్షాలు చేతులు కలపాలన్నారు. ‘అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, అసదుద్దీన్ ఒవైసీ.. విడివిడిగా బీజేపీని ఓడించలేరు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యకూటమి ఏర్పాటు కావాలని, అప్పుడే కమల దళాన్ని ఓడించగలమ’ని పేర్కొన్నారు. బీజేపీ వరుస విజయాలపై స్పందిస్తూ.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ రాజకీయ జీవితంలో ఉన్నత దశలో ఉన్నప్పుడే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. దేశంలో ప్రతిపక్షాలు బలహీనపడినప్పుడు ప్రజలే విపక్షంగా మారి ప్రభుత్వాలను గద్దె దించారని వివరించారు. గుజరాత్‌లో అద్భుతంగా పనిచేసిందని బీజేపీ అనుకుంటే పునరాలోచించాల్సిన అవసరముందన్నారు. ఔరంగజేబు, పాకిస్తాన్ పేరుతో బీజేపీ ఎల్లప్పుడూ ఓట్లు సంపాదించలేదని అసదుద్దీన్ అన్నారు.
అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Published Mon, Dec 18 2017 2:53 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment