పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో జననేతకు తమ కష్టాలు చెప్పుకొంటున్న అవ్వతాతలు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు తమను నమ్మించి నట్టేట ముంచాడని వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. బాబును నమ్మి పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 15 నియోజకవర్గాలు టీడీపీకి ఇచ్చినందుకు మాకు తగిన శాస్తి జరిగిందన్నా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 172వ రోజు శనివారంఉండి నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. ఆకివీడు నుంచి జక్కరం వరకూ సాగిన పాదయాత్రలో దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, ఉపాధి కూలి గిట్టుబాటుకావడం లేదని, ఊళ్లో రోడ్లు లేవని, తాగునీరు దొరక్క తల్లడిల్లుతున్నామని.. ఇలా తమ సమస్యలను ఏకరవుపెట్టారు.
టీడీపీ వార్డు మెంబర్నయినా..
ప్రజా సంకల్ప యాత్ర కుప్పనపూడి చేరుకున్నప్పుడు ఘనస్వాగతం పలికిన స్థానికులు.. తమ సమస్యలు చెప్పుకొన్నారు. టీడీపీ తరఫున వార్డు మెంబర్‌గా గెలిచినా.. ఈ ప్రభుత్వం తమకు పనులు చేయడం లేదంటూ పాలమూరి బేబీకుమారి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చర్చి కట్టిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మీ మాత్రం కూడా మా స్థానిక టీడీపీ నాయకులు నాతో మాట్లాడలేదన్నా.. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేందుకు దేవుని ప్రార్థిస్తామన్నా..’ అంటూ ఆమె అన్నప్పుడు వైఎస్ జగన్ స్పందిస్తూ.. టీడీపీ నాయకుల తీరును ఇప్పటికైనా తెలుసుకున్నారమ్మా.. మీరందరూ బాగుండాలి.. మీ అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తా.. అంటూ భరోసా ఇచ్చారు.
ఉపాధి కూలి గిట్టుబాటు కావడం లేదు..
కుప్పనపూడి గ్రామ శివార్లకు పాదయాత్ర రాగానే ‘అడుగో అన్నొస్తున్నాడు..’ అంటూ పొలాల్లో పనిచేస్తున్న మహిళా కూలీలు పరుగుపరుగున వచ్చి జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉపాధి హామీ కూలి రోజుకు రూ.80 నుంచి 100 కూడా రావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కొద్దిపాటి మొత్తాన్ని కూడా నెలల తరబడి ఇవ్వడం లేదని చెప్పారు. కూలి డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.
బాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా..
కుప్పనపూడి, కోలనపల్లి, కాళ్ల, జక్కరం గ్రామాల ప్రజలు వైఎస్ జగన్‌కు తమ తాగునీటి కష్టాలు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా తమ గ్రామాలకు తాగునీరు లేదని, అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరించాలని వారు జననేతను కోరారు. కాలువల పక్కన నీళ్ల చెరువులు తవ్వించి, రక్షిత మంచి నీటి పథకాల ద్వారా నీరందిస్తామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. సీసలి గ్రామం వద్ద పలువురు రైతులు వైఎస్ జగన్‌ను కలిసి గిట్టుబాటు ధరలేక తాము పడుతున్న ఇబ్బందులను, దళారుల దోపిడీ తీరును వివరించారు. పంట రుణాలు మాఫీ కాలేదని, వడ్డీలు కట్టి పాత అప్పుల్నే పునరుద్ధరించుకోవాల్సి వస్తోందని, బ్యాంకులు కొత్తగా పంట రుణాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అర్హత ఉన్నా పింఛన్‌లు ఇవ్వడం లేదని పలువురు అవ్వాతాతలు జననేతకు మొరపెట్టుకున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
పింఛన్ ఇవ్వాలని వేతన అర్చకుల సంఘం నేతల వినతి
కాళ్ల గ్రామ సమీపంలో వైఎస్ జగన్‌ను కలిసిన వేతన అర్చకులు, సిబ్బంది.. హిందూ దేవాదాయ చట్టం ప్రకారం దేవాలయాలకు వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని ఆలయ వేతన అర్చకులకు, సిబ్బందికి వేతనాలుగా ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులున్నా అమలు చేయడం లేదని వాపోయారు. తెలంగాణలో అమలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన అర్చకులకు పింఛన్ ఇప్పించాలని, గ్రాట్యుటీకి ప్రతి బంధకంగా ఉన్న నెలసరి వేతన పరిమితిని ఎత్తివేయాలని అర్చకులు, సిబ్బంది సంఘం నేతలు పోతుకూచి తారక వశీంద్రశర్మ, మొవ్వా భూమేంద్రశివ, కడలి అనంతరావు తదితరులు వైఎస్ జగన్‌ను కోరగా.. ఈ అంశాన్ని పరిశీలించి న్యాయం చేస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు.
జగన్‌ను కలిసిన పోసాని
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కోలనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కలిసి.. ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. మరోపక్క వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని పలువురు పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ముస్లింలు పలువురు మక్కా మసీదు నుంచి తెచ్చిన తజ్బీలను వైఎస్ జగన్‌కు కట్టారు. వారితో కలిసి జగన్ రంజాన్ ప్రార్థనలు చేశారు. తమ పింఛన్లు పెంచుతామని ప్రకటించినందుకు అవ్వాతాతలు ఆశీర్వచనాలు పలికారు. పాదయాత్రలో పలువురు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కల్లుగీత కార్మికుల్ని ఆదుకోరూ..
కోలనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కల్లుగీత కార్మికులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాటి, ఈత చెట్లను విచ్చలవిడిగా నరికేస్తుండటంతో ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. దీనికితోడు ప్రభుత్వం అనుమతించిన చీప్ లిక్కర్‌తో తమ కడుపు కొడుతున్నారని, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో తమ బతుకులు భారమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్.. ఈ సమస్య పరిష్కార మార్గాలపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలో అందరం కలిసి పరిష్కారం కనుగొందామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment