సాక్షి,కరీంనగర్ : ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో రాజకీయ కూడలిలో నిలబడ్డ మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను చూస్తే మరోసారి అది నిజమే అనిపిస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను వీడిన వివేక్‌కు అప్పట్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ టికెట్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చినా, గతంలో ఎదురైన చేదు అనుభవాలతో భయపడి వెనక్కి తగ్గారు.
ఆ ఎన్నికల్లో పెద్దపల్లిని ఆనుకొని ఉన్న మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నిక తర్వాత బీజేపీ హవా పెరగడం, రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలిచి ఊపు మీదుండడంతో వివేక్ సైతం ఆ పార్టీలోకి వెళ్లాలని భావించారు. గత నెల 23న ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తన కుమారుడు వంశీతోపాటు కలిసినప్పుడు బీజేపీలో చేరుతారని అందరూ అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీలను కూల్చి, కొత్త నిర్మాణాలు జరిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఓ వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు.
ఇది జరిగిన ఐదు రోజులకు జులై 28న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వివేక్ ఇంటికి వెళ్లి ‘బీజేపీలో చేరొద్దు. తిరిగి కాంగ్రెస్‌లోకి రండి’ అని ఆహ్వానించారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియని విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నారు. ఈలోపు ఆయన వెంట ఉన్న పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అనుచర వర్గం ఎవరి దారి వారి చూసుకుంటున్నారు.
నిలకడలేని నిర్ణయాలతో...
తుది వరకు కాంగ్రెస్‌వాదిగా, ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో పదవులు అలంకరించిన గడ్డం వెంకటస్వామి వారసుడిగా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వికటించి అసలుకే ఎసరు తెచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన వివేక్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న దశలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాత సరిగ్గా 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని సోనియాగాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విద్యార్థి నాయకుడిగా పోటీ పడ్డ బాల్క సుమన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్‌తో సఖ్యతతో మెలిగిన ఆయన 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... అనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనేది ఆరోపణ.
ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురితోపాటు పెద్దపల్లి, చెన్నూరు, మంథని, రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాలలో సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని ఆరోపణ. మంథని, రామగుండం సీట్లు టీఆర్‌ఎస్ కోల్పోవడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో పంచాయితీ కేటీఆర్ వద్దకు వెళ్లినా, ఎమ్మెల్యేలు వినలేదు. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌కే ఎసరొచ్చింది. విచిత్రం ఏంటంటే బాల్క సుమన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకు సాయపడ్డారని వివేక్ మీద ఆరోపణ కాగా, ఆ ఎన్నికల్లో తనపై ఓడిపోయిన వెంకటేష్ నేతను గెలిచిన సుమన్ టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి టికెట్టు ఇప్పించడం.
బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఉంటే..?
పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్టు ఇవ్వకపోవడంతో వివేక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామంటే ఆ పార్టీ అప్పటికే చంద్రశేఖర్‌కు బీఫారంతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిస్థితిలో బీజేపీ ముందుకొచ్చింది. పార్టీ అప్పటికే ఎస్.కుమార్ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, వివేక్ కోసం రెండు రోజులు బీఫారం ఇవ్వకుండా ఆపింది. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎంత నచ్చచెప్పినా, పోటీ చేసేందుకు వివేక్ ఒప్పుకోలేదు.
గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తేనే ఓట్లు పడలేదని, ఈసారి బీజేపీ నుంచి చేస్తే ఎవరు ఓటేస్తారని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. చివరికి బీజేపీ జాతీయ నేత రాంమాధవ్‌తో కూడా పలు మార్లు భేటీ అయి ఇదే విషయం చెప్పడంతో ఎస్.కుమార్‌ను అభ్యర్థిగా నిలిపింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి చుట్టున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలవడం. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే టీఆర్‌ఎస్ మోసం చేసిందనే సానుభూతితోపాటు మోదీ హవా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రభావం కూడా పెద్దపల్లిపై పడేవని, అన్నింటికన్నా ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ కొత్తవారు కావడం లాభించేదని రాజకీయ విశ్లేషకుల వాదన.
ఇప్పుడెటు..?
టీఆర్‌ఎస్‌లో తనకు అండగా నిలిచిన కొందరు రామగుండం నాయకులు ఇటీవల బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సైతం కమలం కండువా కప్పుకున్నారు. రేపటి మునిసిపల్ ఎన్నికలను ఆయన సవాల్‌గా తీసుకోబోతున్నారు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరికను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీధర్‌బాబు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వ్యతిరేక వర్గం కాబట్టే తనకు పడని వివేక్‌ను ఆహ్వానించేందుకు వెళ్లారనేది ఆయన వర్గీయుల వాదన. ఈ పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరుతారో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment