సాక్షి, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. అదేవిధంగా 22 నుంచి 23 ఎంపీ సీట్లు ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని మంత్రి ఎద్దేవ చేశారు. ఆ పార్టీ అవలంభిస్తున్న తీరు నచ్చకనే నాయకులు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో అలీబాబా 40 దొంగలు అంతా చేరి కోట్ల ధనం వృథా చేశారని మండిపడ్డారు. చంద్రబాబుతో సహా ఎంత మంది వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పోందాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ ఉపన్యాసాలకే పరిమితమయ్యారే తప్ప పనులు చేసింది లేదన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు సంతోషంగా
పేదల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిందని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశంలో తొలిసారి ప్రవేశపెట్టింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పరిశ్రమలు తరలివస్తున్నాయని మంత్రి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకపోతుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు చించుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment