సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ అభ్యర్థి బంగారయ్య
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు ఆదివారం పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. పరవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పరిశీలకునిగా నిర్వహించిన ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, లాలంకాశీనాయుడు, నల్లపురాజు వెంకటరాజు, మరో సీనియర్ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్‌లతో పాటు ఇతర ముఖ్యనాయకులు ముఖం చాటేశారు.
ఒకరిద్దరు నాయకుల మినహా నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. జాతీయ రహదారి పక్కన పీఎల్‌పురం సమీపంలోని ద్వారకా హోటల్‌లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశానికి పట్టుమని 100 మంది కూడా రాకపోవడంతో సమావేశం బోసిపోయింది. చోటామోటా నాయకులతోనే ఈ సమావేశాన్ని మమ అనిపించారు. పార్టీ ముఖ్యనాయకులు చెబుతున్నట్లుగా ఈ ఎన్నికల్లో టీడీపి ఓటమికి ఈవీఎంలు కారణం కాదని, పార్టీలో ఐకమత్యం లేకపోవడమేనని ఎస్‌రాయవరం మండలానికి చెందిన తుంపాల నాగేశ్వరరావు అనే నాయకుడు సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయింది. మనలో లోపాలను ఈవీఎంలపై నెట్టడం సరికాదని నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
ఉద్యోగం పోయింది... ఓటమి మిగిలింది...
ఈ సమావేశంలో అభ్యర్థి బంగారయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్యే అవుదామన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పాయకరావుపేట టీడీపీకి కంచుకోట అని భావించానని విజయం తథ్యమని ఆశపడ్డానన్నారు. ఉన్న ఉద్యోగం పోయి.. ఆశలు ఆవిరయ్యాయని. ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతానని, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment