అభివృద్ధి ఎక్కడ బాబూ? | YS Jagan fires on Chandrababu At Visakha Kancharapalem | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఎక్కడ బాబూ?

Published Mon, Sep 10 2018 3:28 AM | Last Updated on Mon, Sep 10 2018 6:19 PM

YS Jagan fires on Chandrababu At Visakha Kancharapalem - Sakshi

విశాఖ నగరం కంచరపాలెంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం.. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎక్కడ భూములు కనిపించినా లాక్కోవడం.. చక్కగా పని చేస్తున్న సహకార సంస్థలను నష్టాల్లోకి నెట్టడం.. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం.. ఎడాపెడా పన్నులు బాదేయడం.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం.. పేదలకు వైద్యం, చదువును దూరం చేయడం.. ఇవేనా అభివృద్ధి అంటే బాబూ’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తల్లిదండ్రులను చంపి అమాయకత్వం నటించిన ఓ నిందితుని తీరు గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో విశాఖపట్నం నగరానికి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా అమలు చేశావా? అని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 258వ రోజు ఆదివారం ఆయన విశాఖపట్నం మహానగరంలోని కంచరపాలెం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసినప్పుడు పెట్రోల్, డీజిల్‌ ధరలు గానీ, ప్రత్యేక హోదా గానీ గుర్తుకు రాలేదా? అని సూటిగా ప్రశ్నించారు. బాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ధ్వంసమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుచూపుమేరలో ఎటుచూసినా ఇసుకవేస్తే రాలనంతగా జనం హాజరైన ఈ సభలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

రివర్స్‌గేర్‌లో విశాఖ అభివృద్ధి 
‘‘ఈరోజు ఈ నగరంలో నడుస్తున్నప్పుడు నాదగ్గరకు వచ్చి ప్రజలన్న మాటలు.. అన్నా.. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి పాలన మా అందరికీ గుర్తుందన్నా.. ఆయన ఈ విశాఖ నగరాన్ని టాప్‌గేర్‌లో నడిపించారన్నా.. నాన్నగారి హయాంలో విశాఖలో వేల మందికి ఉద్యోగాలొచ్చాయన్నా.. పారిశ్రామికంగా ఈ నగరం బాగుపడిందన్నా.. ఐటీ వచ్చిందన్నా.. పేదవాడికి ఇళ్లు వచ్చాయన్నా అని చెప్పారు. నాన్నగారు వెళ్లిపోయాక ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కష్టాలూ చెప్పుకొచ్చారు. నాన్నగారి హయాంలో టాప్‌గేర్‌లో విశాఖ ప్రయాణం చేస్తే చంద్రబాబు పాలనలో రివర్స్‌ గేర్‌లో వెళ్తోందని చెబుతున్నారు. నాన్నగారు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తీసుకొచ్చారన్నా.. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు చేశారన్నా.. రాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ కోసం రెండు బీఆర్‌టీఎస్‌ రోడ్లు తీసుకొచ్చారన్నా.. ఈ రోడ్ల కోసం రూ.456 కోట్లు ఖర్చు చేశారన్నా.. కంచరపాలెం నుంచి పెందుర్తి, ఆరిలోవ నుంచి సింహాచలం రోడ్లు తీర్చిదిద్దిన ఘనత రాజశేఖరరెడ్డిదేనన్నా.. అని చెబుతున్నారు. ఆరు రోడ్ల  విస్తరణలో భాగంగా ఈ బీఆర్‌టీఎస్‌ రోడ్లలో 1.3 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉంటే ఆ పనులు చేయలేని అధ్వాన పరిస్థితిలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నా అని చెప్తా ఉన్నారు. 


15 కాలనీలు వైఎస్‌ చలవే.. 
నాన్నగారి హయాంలో 15 చోట్ల 15 కాలనీలు వచ్చాయన్నా. ఏకంగా 35 వేల ఇళ్లు కట్టించారన్నా.. అని చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు బీఐఎఫ్‌ఆర్‌కు పోయే పరిస్థితి ఉంటే నాన్నగారి హయాంలో కేంద్రంతో పోరాడి నిలబెట్టారన్నా.. విస్తరణకు పోయి రెట్టింపు కేపాసిటీతో నేడు అది నడుస్తా ఉందంటే దానికి కారణం వైఎస్‌ చొరవే అని చెబుతున్నారు. ఎన్టీపీసీ విస్తరణ కాని, హెచ్‌పీసీఎల్‌ విస్తరణ కానీ, ఎప్పటికీ మరచిపోలేని కార్యక్రమాలన్నా.. మూతపడ్డ బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేసి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడారన్నా.. షిప్‌యార్డు కూడా నష్టాల ఊబిలో నడవలేని పరిస్థితిలో ఉంటే దాన్ని రక్షణ శాఖలో విలీనం చేయించడంలో కూడా వైఎస్‌ చూపిన చొరవే కారణమన్నా.. అని చెబుతా ఉన్నారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, విశాఖ, దువ్వాడలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మసిటీ, బ్రాండిక్స్‌ నుంచి మొదలై ఎస్‌ఈజెడ్‌లలో పరిశ్రమల వరకు ఎక్కడ చూసినా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయంటే ఆ దివంగత నేత చలవేని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. 

విశాఖ ఎయిర్‌పోర్టుకు వరదొచ్చినా.. వర్షం వచ్చినా.. విమానాలు పైకి ఎగురుతాయో లేదోననే అనుమానం ఉండేదన్నా..  మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి ముంపు నీరు పోయేందుకు కాల్వ తీసుకొచ్చి ఎయిర్‌పోర్టును ముంపునకు గురికాకుండా కాపాడిన ఘనత వైఎస్‌దేనని చెబుతున్నారు. నాన్నగారి హయాంలో రూ.100 కోట్లతో టెర్మినల్‌ని నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు.
 
భాగస్వామ్య సదస్సుల పేరుతో చెవిలో పువ్వులు 

విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు పెడతుంటారు. మూడు రోజుల పాటు మీటింగ్‌లు పెట్టి రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని చెబుతాడు ఈ పెద్దమనిషి (చంద్రబాబు). మీకెక్కడైనా కనిపించాయా? ఎన్ని వేల కోట్ల పరిశ్రమలొచ్చాయో తెలుసుకునేందుకు ఓ సంస్థ ఉంది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇండిస్ట్రీ పాలసీ అండ్‌ ప్రమోషన్‌.. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌లో ఉంది. ప్రతి ఏటా డిసెంబర్‌ 31వ తేదీన ఏ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులొచ్చాయో ప్రకటిస్తుంటారు. ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే మొట్ట మొదట దాంట్లో అప్లికేషన్‌ పెడతారు. దీన్ని ఐఈఎం అని అంటారు. అంటే ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూయర్‌ ఆఫ్‌ మెమోరాండం.

బ్యాంకు లోన్లు ఇవ్వాలన్నా, ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ రావాలన్నా, పొల్యూషన్‌ క్లియరెన్స్‌ రావాలన్నా దీంట్లో అప్లికేషన్‌ పెట్టాల్సిందే. వీటిని బట్టే ఏ ఏ రాష్ట్రాలకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులొస్తాయో డిక్లేర్‌ చేస్తారు. ఈ సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఏటా సగటున రూ.5 వేల కోట్లు కూడా రాలేదు. నాలుగేళ్లలో రూ.20 వేల కోట్లు కూడా రాలేదని ఆ డిప్‌ చెబుతా ఉంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు మాత్రం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలని చెప్పి మనందరి చెవుల్లో పువ్వులు పెడతారు. మూడు రోజుల ఈ సదస్సు నిర్వహించేందుకు  అక్షరాల రూ.150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఈ రూ.150 కోట్లలో తిండి బిల్లు రూ.53 కోట్లు. అంటే ఏ స్థాయిలో దోచేస్తున్నారో చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. 

కంప్యూటర్లకు కూడా అబద్ధాలు నేర్పగల ఘనుడు ఈ పెద్దమనిషి 
ఐటీ రంగాన్ని పరిశీలిస్తే.. ఆ దివంగత నేత, నాన్నగారి హయాంలో దాదాపు 10 ఏళ్ల కిందటనే 18 వేల మందికి  ఉద్యోగాలొచ్చాయి. ఆనాడే విశాఖ నగరం నుంచి రూ.2 వేల కోట్ల ఐటీ ఎగుమతులుంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు హయాంలో నాలుగున్నరేళ్లలో 18 వేల ఉద్యోగాలు కాస్తా పెరగాల్సింది పోయి 16 వేలకు పడిపోయాయి. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌ నాన్నగారి హయాంలో రూ.2 వేల కోట్లుంటే.. 10 ఏళ్ల తర్వాత పెరగాల్సింది పోయి బాబు హయాంలో రూ.1145 కోట్లకు పడిపోయాయి. విశాఖలో ఆ విప్రో బిల్డింగ్‌ కన్పిస్తోంది. దాంట్లో ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ బిల్డింగ్‌ కట్టిన పరిస్థితి. ఇవాళ అక్కడ 250 మంది కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఇక ఐటీ స్పేస్‌ ఎంతుందో తెలుసా? మొత్తం ఐదు లక్షల ఐదువేల ఎస్‌ఎఫ్‌టీ స్థలం ఉంటే ఇందులో ఖాళీగా ఉన్నది అక్షరాల 4.27లక్షల ఎస్‌ఎఫ్‌టీ. ఈ పెద్దమనిషి హయాంలో ఇంతటి దారుణంగా ఐటీ రంగం ఉంటే కళ్లార్పకుండా అబద్దాలు చెప్పేస్తాడు. కంప్యూటర్లకు కూడా అబద్దాలు నేర్పగలడీ పెద్దమనిషి. అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో పీహెచ్‌డీ చేసిందెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. 

ఏ హామీ నెరవేర్చని బాబు 
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూసి ఇక్కడి ప్రజలు నాతో అంటున్న మాటలేమంటే.. ఎన్నికల్లోనే కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు ఇచ్చిన హామీలకు దిక్కు దివాణం లేదన్నారు. ఎన్నికలప్పుడు ఈ పెద్దమనిషి విశాఖకు రైల్వే జోన్‌ అని ఊదరగొట్టాడు. నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేశాడు. అప్పుడు రైల్వే జోన్‌ గుర్తుకు రాలేదు. ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. మొదటి భార్య బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మొదటి భార్య చెడ్డది అంటున్నాడు. ఆ నాలుగున్నరేళ్లు మొదటి భార్య మంచిదెలా అయ్యింది చంద్రబాబూ? 

ఇవి మీకెక్కడైనా కనిపించాయా? 
ఇదే విశాఖ నగరానికి జాతీయ క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తానన్నాడు. ఎక్కడైనా కన్పించిందా? నాన్న గారు కట్టిన స్టేడియం ఒక్కటే కన్పిస్తోంది. ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ అట. కనిపించిందా? విశాఖకు ఐటీ సిగ్నేచర్స్‌ టవర్స్‌ అని మనందరికి సినిమా చూపించారు. గ్రాఫిక్స్‌ చూపించాడు. ఎక్కడైనా అవి కన్పించాయా? విశాఖకు మెట్రో రైలట.. సైన్సు సిటీ అట.. మరో డీప్‌ వాటర్‌ పోర్టట. ఉన్న పోర్టులోనే ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి. మరో డీప్‌ వాటర్‌ పోర్టు మీకు ఎక్కడైనా కన్పించిందా? భీమిలి నుంచి కాకినాడ వరకు తీరం వెంబడి రహదారట. సబ్బవరంలో భారీ పరిశ్రమలట. విశాఖలో కూచిపూడి కళాక్షేత్రమట. విశాఖకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ అట. ఇవన్నీ మీకెక్కడైనా కనిపించాయా? 

హుద్‌హుద్‌ను జయించావా? 
ఈ పెద్దమనిషి హుద్‌హుద్‌ తుపాన్‌ను జయించాం అన్నాడు. ఆ తుపాను కారణంగా 25 వేల ఇళ్లు దెబ్బతిన్నట్టు ఆవేళ నిర్దారిస్తే ఇప్పటి వరకు అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద ఈ పెద్దమనిషి కట్టించింది కేవలం 4 వేలు. అదే ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల కాలంలో 35 వేల ఇళ్లు కట్టి చిరస్మరణీయుడిగా మిగిలితే చంద్రబాబు హయాంలో స్కామ్‌లే మిగిలాయి. ఇప్పుడు కొత్తగా  ఫ్లాట్లు కట్టిస్తానంటున్నాడు. 300 చదరపు అడుగుల ఫ్లాటట. అడుగు రూ.2 వేలకు అమ్ముతాడట. లిఫ్ట్, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ లేని ఈ ఫ్లాట్లకు అడుక్కి మహా అయితే వెయ్యి రూపాయలకు మించికాదు. ఇలా ఈ ఫ్లాటును రూ.6 లక్షలకు పేదలకు అమ్ముతారట. ఇందులో కేంద్ర, రాష్ట్రాలు సగం ఇస్తే, మిగతా సగం రూ.3 లక్షలు పేదవాడిపై అప్పుగా రాస్తారట. ఈ బాకీ తీర్చేందుకు పేదలు నెలనెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు కడుతూ పోవాలట. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి గనుక కాస్తోకూస్తో ఆ ఫ్లాట్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఆ అప్పును మాఫీ చేస్తానని మాట ఇస్తున్నా.  

విశాఖను దోచేశారు 
ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో విశాఖ నగరంలో ఎక్కడ ఏ భూమి కన్పించినా వదలకుండా దోచేశారు. పేదలకు గతంలో నాన్నగారి హయాంలో ఇళ్లు కట్టించేందుకు రాజీవ్‌ స్వగృహ కింద భూములు కేటాయిస్తే చంద్రబాబు హయాంలో ఆ భూములను లాక్కొని తన బంధువు గీతం యూనివర్సిటీ మూర్తికి అప్పగించాడు ఈ పెద్దమనిషి. విశాఖతో సహా రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూములున్నా సరే ఈ పెద్దమనిషి కేబినెట్‌ మీటింగ్‌ పెడతారు.ఆ మీటింగ్‌లో పేదలు, రైతుల కోసం చర్చ జరగదు. ఆ గజదొంగల కేబినెట్‌లో జరిగే డిస్కషన్స్‌ ఏమిటో తెలుసా? వాళ్ల బినామీలకు శనక్కాయలకు, బిస్కెట్లకు ఏ భూములు కేటాయించాలా అని చర్చిస్తారు. విశాఖ నగరంలో ఇప్పటికే చాలా ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ ఉన్నాయి. ఇదే విశాఖలో ఇంకొక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు లూలూ గ్రూపునకు భూములు కట్టబెట్టారు. లూలూ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? పేరుకు తగ్గట్టుగానే ఉంది వాళ్ల వ్యవహారం. ఏకంగా విశాఖ నగరంలో వెయ్యి కోట్ల విలువైన 9.12 ఎకరాలను కేటాయించారు. ఇవి చాలవన్నట్టు పక్కనే ఓ ప్రైవేటు సంస్థకు చెందిన మూడున్నర ఎకరాలు తీసుకుని దానికి పరిహారంగా ఈ ప్రైవేటు సంస్థకు విశాఖలో వందల కోట్ల విలువైన భూములను చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టాడు. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన 12 ఎకరాలు కేటాయించారు.  

ఆ మంత్రి ఎవరో చెప్పాల్సిన పని లేదు.. 
విశాఖలో భూ రికార్డులు మార్చేస్తారు. తమది కాని గవర్నమెంట్‌ భూములకు తమ పేరిట పత్రాలు సృష్టిస్తారు. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారిక్కడి మంత్రులు, నాయకులు. ఆ మంత్రి ఎవరని నేను చెప్పాల్సిన పనిలేదు. ఆ మనిషిని గంటా అని కూడా అంటారు. తనది కాని గవర్నమెంట్‌ భూములను తనవేనని రికార్డులు సృష్టించి ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తెచ్చుకున్న ఘనత గంటాదని చెబుతా ఉంటారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు కోసం అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఎంపీల భూములను ముట్టుకోరు. కానీ పక్కనే పేదల భూములను బలవంతంగా లాక్కుంటారు.   

ఉక్కు, పోర్టు, విమ్స్‌..అన్నీ అధోగతే 
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో ఏకంగా 32 మంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కును తెచ్చుకున్నారు. ఈ పెద్దమనిషి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశాఖ ఉక్కు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయి బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లిపోయిన పరిస్థితి. ఆ తర్వాత నాన్నగారు చొరవ చూపి కేంద్రంతో పోరాడి రూ.12 వేల కోట్లతో విస్తరణకు ముందడుగు వేశారు. మళ్లీ చంద్రబాబు అడుగుపెట్టారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిస్థితి ఏమిటో తెలుసా? నాలుగేళ్లుగా వరుసగా నష్టాలే నష్టాలు. ఈ పెద్దమనిషి లెగ్‌ అటువంటుంది. అడుగు పెడితే ఏదైనా ధ్వంసం కావాల్సిందే. పక్కనే విశాఖపట్నం పోర్టు కనిపిస్తోంది. ఇందులో మొత్తం 24 బెర్తులు ఉంటే ఇప్పటికే 12 బెర్తులను ప్రైవేటు పరం చేశారు. ఒకప్పుడు ఇదే పోర్టులో 24 వేల మంది కార్మికులు పని చేస్తుంటే ఇవాళ కేవలం 4 వేల మంది పని చేస్తున్నారు. ఏది ముట్టుకున్నా ప్రైవేటు పరమే.

ఇదే పోర్టులో కార్గో హ్యాండ్లింగ్‌ ఉంది. ఒకప్పుడు అది దేశంలోనే నంబర్‌ వన్‌. ఇవాళ 5వ స్థానంలోకి పోయింది. పోర్టులో కళాసీలు తమ జీతాలు పెంచమని అడిగినా పట్టించుకునే నాథుడు ఉండడు. పోర్టులో ఉన్న స్కూలు కూడా మూతపడిన పరిస్థితి. ఉద్యోగుల క్వార్టర్లు ఉన్న 20 ఎకరాల భూమిని ఈ పెద్దమనిషి చంద్రబాబు ఎలా లాక్కోవాలి.. అని స్కెచ్‌ వేస్తున్నాడు. పక్కనే విమ్స్‌.. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ కనిపిస్తుంది. విశాఖకు ఉన్నది ఒక్కటే ఆస్పత్రి కేజీహెచ్‌ అని.. విశాఖపట్నం అవసరాలకు అది సరిపోదని, ఇంకో గొప్ప ఆస్పత్రి రావాలని పదేళ్ల కిందటే ఆ దివంగత నేత.. హైదరాబాద్‌లోని నిమ్స్‌ తరహాలో ఇక్కడ కూడా వంద ఎకరాల విస్తీర్ణంలో 1130 పడకలతో 6 బ్లాకులతో 21సూపర్‌ స్పెషాలిటీ విభాగాలతో ఆ రోజుల్లోనే రూ.250 కోట్లు కేటాయించి విమ్స్‌ను మొదలు పెట్టారు. ఇవాళ ఆ ఆరు బ్లాకులను రెండింటికి, 21 సూపర్‌ స్పెషాలిటీలను ఎనిమిదింటికి కుదించారు. కనీసం డాక్టర్లను నియమించాలన్న జ్ఞానం కూడా లేకుండా వారిని సైతం డెప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. జీవో నంబర్‌ 30 తీసుకువచ్చి ప్రతి సర్వీసును తన లంచాల కోసం ప్రైవేటు పరం చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నాడు.  

కేజీహెచ్‌లో మంచానికి ఇద్దరు రోగులు 
ఇటుపక్కనే కేజీహెచ్‌ ఆస్పత్రి ఉంది. 1845లో అంటే 173 ఏళ్ల కిందట కట్టారు. ఉత్తరాంధ్రలో ఎవరికి జబ్బు చేసినా ఈ ఆస్పత్రికే తీసుకువస్తుంటారు. అంతటి మంచి ఆస్పత్రి అది. ప్రతి రోజూ రెండు వేల మందికి పైబడి ఆ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. కానీ అక్కడ 1200 బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ ఆస్పత్రిలో మంచానికి ఒకరిని కాకుండా ఇద్దరు రోగుల్ని పడుకోబెట్టాల్సిన పరిస్థితి. కేజీహెచ్‌లో అవసరం ఉన్నా డాక్టర్లను గానీ, నర్సులను గానీ రిక్రూట్‌ చేయరు. క్యాన్సర్‌ వచ్చిందని అక్కడికి పోతే దిక్కూ దివాణం లేని పరిస్థితి. గుండె జబ్బు వస్తే వైద్యం చేసే విభాగం మొత్తాన్నీ ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ పెద్దమనిషి. ఇదే కేజీహెచ్‌లో రోడ్లు కూడా లేని అధ్వాన పరిస్థితి. దగ్గరుండి గవర్నమెంటు ఆస్పత్రులను నిర్వీర్యం చేసి మన వాళ్లను వాటివైపు పోకుండా చేస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో మామూలు ప్రసవానికి రూ.50 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలా అని కేజీహెచ్‌కు పోతే మంచానికి ఇద్దర్ని పడుకోబెడుతున్నారు. ఉత్తరాంధ్రలో జ్వరాలు వచ్చి 200 మంది చనిపోతే పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యం అవుతాయి. ప్రైవేటు ఆస్పత్రులకు పోదామంటే అక్కడ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతటి దారుణంగా విశాఖనగరంలో పరిపాలన సాగుతోంది. 

మీరే పన్నులేస్తారు.. మీరే బంద్‌లు చేస్తారా? 
పక్కనే పోర్టు కనిపిస్తోంది. పరిశ్రమలు, పోర్టు కారణంగా 15 కిలోమీటర్ల మేర కాలుష్యం. దీంతో వన్‌టౌన్‌లో ఉండాలంటే భయపడే పరిస్థితి. అయినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇవాళ విశాఖపట్టణంలో క్రైమ్‌ రేటు పెరిగిపోయింది. 2015లో 16 హత్యలు, 2016లో 29 హత్యలు, 2017లో 27 హత్యలు 2018లో ఇప్పటి వరకు 12 హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏమిటో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇవాళ దాని పరిస్థితి ఏమిటంటే.. 953 మంది సిబ్బంది, 550 టీచింగ్‌ పోస్టులు ఇవాల్టికీ ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలను నిర్వీర్యం చేస్తూ, నీరుగారుస్తూ మన పిల్లలు ఎవ్వరూ అటువైపు పోకుండా గీతం యూనివర్సిటీ వైపు పోయేలా చేస్తున్నారు. ఈ స్థాయిలో నారాయణ, గీతం యూనివర్సిటీలను తయారు చేస్తున్నాడు ఈ పెద్దమనిషి.  శ్రీకాకుళం, ఇచ్చాపురం మొదలు విజయనగరం వరకు ఎక్కడెక్కడి నుంచో విశాఖకు ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో, మంచి చదువు కోసమో వస్తాం. ఇక్కడ ధరలు చూస్తుంటే షాక్‌ కొడుతున్నాయి.

కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోలు, డీజిల్, ఇంటిపన్నులు బస్సు చార్జీలు, స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు, చివరకు నీటి పన్ను చూసినా బాదుడే బాదుడు. ఓవైపు చంద్రబాబు హయాంలో ధరలు బాదుతూ, మరోవైపు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయట. కాంగ్రెస్‌ పార్టీ రేపు బంద్‌కు పిలుపు ఇచ్చిందట.. దానికి మద్దతు ఇవ్వండీ అని చంద్రబాబు చెబుతుంటే నవ్వాల్నో, ఏడవాల్నో అర్థం కావడం లేదు. చుట్టు పక్కల రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పక్కనే ఉన్న యానాంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో కంటే పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు తక్కువగా ఉంటాయి. నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.5, రూ.7 వరకు అదనంగా బాదుడే బాదుడు. నిజానికి కేంద్రం వేసే వాటికన్నా రాష్ట్రం వేసే పన్నులు ఎక్కువ. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిందట, పాల్గొనాలని టీడీపీని ఆహ్వానించిందట. దానికి బాబు మద్దతిస్తాడట. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?  

ముఖ్యమంత్రే దళారీ అయితే.. 
రైతులకు దమ్మిడీ మేలు జరక్కపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం షాక్‌ కొడుతున్నాయి. రైతుల దగ్గర నుంచి క్వింటాల్‌ ధాన్యాన్ని రూ.1500కు కూడా కొనరు. అదే చంద్రబాబు నాయుడి హెరిటేజ్‌ రిటైల్‌ షాపులో కిలో బియ్యం రూ.46కు అమ్ముతారు. కర్నూలులో కిలో ఉల్లిపాయల్ని రైతుల నుంచి రూ.4కు కొని అందంగా ప్యాక్‌ చేసి హెరిటేజ్‌ షాపుల్లో మాత్రం కిలో రూ.20కి అమ్ముతారు. కందుల్ని రైతుల నుంచి క్వింటాల్‌ రూ.3200కు కొని హెరిటేజ్‌ షాపుల్లో కిలో కందిపప్పును రూ.77కు అమ్ముతారు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేట్లు తగ్గించాలి. దళారీ వ్యవస్థ లేకుండా చేయాలనే ఆలోచన చేయాలి. కానీ చంద్రబాబు నాయుడే ఏకంగా మాఫియా డాన్‌ అయి దళారీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తూ తన సొంత సంస్థ హెరిటేజ్‌ లాభాల కోసం  ప్రజలను బాదేస్తున్నాడు. ఇదే పెద్దమనిషి హయాంలో ఇదే విశాఖలో పాల ధర చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆ కార్టెల్‌కు, సిండికేట్‌కు నాయకత్వం ఎవరిదో తెలుసా? చంద్రబాబునాయుడి గారి సొంత డెయిరీ హెరిటేజ్‌. అది లాభాల్లోకి రావడం కోసం ఉన్న డెయిరీలన్నీ ఒక్కటయ్యాయి. ఇక్కడే విశాఖ డెయిరీ. ఇది పేరుకు మాత్రమే సహకార డెయిరీ. వాస్తవ పరిస్థితి ఏమిటంటే విశాఖ డెయిరీని టీడీపీ నాయకులు ఆక్రమించేసి కుటుంబ డెయిరీగా మార్చేశారు. ఇదే విశాఖ డెయిరీ, హెరిటేజ్‌ డెయిరీ రైతుల నుంచి లీటర్‌ పాలను రూ.26కు కొంటోంది. వెన్న తీసిన తర్వాత అర లీటర్‌ పాలనే రూ.26కు అమ్ముతారు. 

మీ పిల్లల చదువుల బాధ్యత నాది.. 
ఆరోగ్య శ్రీని భ్రష్టుపట్టించారు. విమ్స్‌ను కట్టరు. కేజీహెచ్‌కుపోతే ఆ ఆస్పత్రిని నిర్వీర్యం చేసే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ అమలయ్యే నెట్‌ వర్కింగ్‌ హాస్పిటళ్లకు 8 నెలల నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. మంచి వైద్యం కోసం హైదరాబాద్‌కు పోదామంటే అక్కడ ఆరోగ్య శ్రీ కట్‌. ఆరోగ్య శ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను వదిలేసి ప్రైవేటు ఆస్పత్రుల వైపు పోయేలా చేస్తున్నాడు ఈ  పెద్దమనిషి. చదువుల విషయానికి వస్తే పేద, మధ్య తరగతి వర్గాలు తమకు వచ్చే జీతాలకు తమ పిల్లల్ని చదివించే స్థితిలో ఉన్నారా? సాదాసీదా స్కూల్లో కనీస ఫీజు రూ.40 వేలుగా ఉంది. దీనికితోడు ఏటా రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్య ఖర్చులు పెరుగుతున్నాయి. అదే ఇంటర్మీడియేట్‌ చదివించాలంటే మన పిల్లలకు ఏటా రూ.60 వేలు కట్టాల్సివస్తోంది. అదే చంద్రబాబు బినామీలైన నారాయణ, ఎంవీఎస్‌ మూర్తి గారి గీతం లాంటి వాటిల్లోనైతే ఇంకా ఎక్కువ. నారాయణలో ఇంటర్‌కు రూ.లక్షా 60 వేలు గుంజుతున్నారు. ఈ తరహా ఖర్చులతో సామాన్యులు ఎలా బతకగలరు? అందుకే రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక పేదల చదువు ఖర్చు బాధ్యత నాదే. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా చదివిస్తాం. వాళ్లను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చేస్తాం. అంతేకాదు హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తా. పెద్ద చదువులకు చిన్నతనంలోనే పునాదులు పడాలి. అందుకే పిల్లలను బడులకు పంపే తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా నిలవండి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

వెన్నుపోటు పొడుస్తారు.. ఎన్టీఆర్‌కు దండేస్తారు.. 
చంద్రబాబు తీరు చూస్తుంటే నాకో కథ గుర్తుకు వస్తోంది. పోలీసులు ఒకసారి ఓ వ్యక్తిని కోర్టు బోనులో నిలబెట్టారట. జడ్జి వచ్చి సీట్లో కూర్చున్నాడట. ఆ వెంటనే బోనులో ఉన్న వ్యక్తి బోరున ఏడుస్తూ.. తల్లిదండ్రులు లేని అమాయకుడిని.. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ లబోదిబోమంటూ మీరే కాపాడాలి సార్‌ అన్నాడట. దాంతో జడ్జి గారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఉద్దేశించి.. ఎందుకయ్యా ఆ వ్యక్తి అలా ఏడుస్తున్నాడు అని అడిగాడట. దానికి ఆ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. సార్‌ ఈ వ్యక్తిని నమ్మకండి, తల్లిదండ్రుల్ని చంపిందే ఇతను అని జడ్జిగారికి చెప్పాడట. అలా ఉంది చంద్రబాబు తీరు. దగ్గరుండి ధరలు పెంచుతాడు. మళ్లీ ఈ పెద్దమనిషే పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొంటాడట. ప్రత్యేక హోదా విషయంలోనైనా అంతే. దగ్గరుండి ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తారు. నాలుగున్నర ఏళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు హోదాకు తూట్లు పొడిచారు. విడాకులు తీసుకున్నాక ధర్మ పోరాట దీక్ష అంటూ పోరాటం చేస్తానంటాడు. పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడుస్తాడు. అదే అవసరం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినపుడు ఎన్టీఆర్‌ ఫొటోకు దండ వేసి ఎన్నికలకు పోతాడు. ఇదీ చంద్రబాబు నైజం. 

టాక్సీ కార్మికులకూ ఏటా రూ.10 వేలు 
ఈ మధ్యాహ్నం నన్ను టాక్సీ డ్రైవర్లు కలిశారు. అన్నా.. ఏదో కిందా మీద పడి ఉన్న ఆస్తులు అమ్ముకుని టాక్సీని కొనుక్కుని తిప్పుకుంటుంటే మా పరిస్థితి చూడండన్నా అని వారి సమస్యలను వివరించారు. ఊబర్, ఓలా అని పెద్ద సంస్థలు వచ్చాయన్నా, వాటితో మేమూ పోటీ పడాలంటన్నా.. ఎలా అన్నా బతికేది? అని అడిగారు. సొంత ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ నేను ఇంతకుముందే చెప్పా.. అదే మాదిరిగా ఇవాళ సొంత టాక్సీ ఉన్న ప్రతి కార్మికునికీ చెబుతున్నా. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులకు ఇచ్చినట్టే టాక్సీ కార్మికులకూ ఏటా రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నా. ఈ పోటీలో పేదవాడు బతకలేని పరిస్థితి. బతకాలి అంటే ప్రభుత్వ చేయూత ఉండాలి. చేయూత అందించాల్సిన ప్రభుత్వం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుంటే జరిమానా వేసే పరిస్థితిలో ఈ మానవత్వం లేని ప్రభుత్వం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement