ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్ గుర్తుందా! సన్‌రైజర్స్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్. అప్పుడు రసెల్ సిక్సర పిడుగల్లే చెలరేగాడు. నైట్‌రైడర్స్‌ను గెలిపించాడు. ఇప్పుడు బెంగళూరు గడ్డపై దాన్ని రిపీట్ చేశాడు. చిత్రంగా అప్పుడు... ఇప్పుడు... నైట్‌రైడర్స్ విజయ సమీకరణం 18 బంతుల్లో 53 పరుగులే. ఈసారి రాయల్ చాలెంజర్స్‌పై రసెల్ 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా విజృంభించాడు. 5 బంతులు మిగిలుండగానే కోల్‌కతాను మళ్లీ గెలిపించాడు.
బెంగళూరు: 200పైచిలుకు పరుగులు చేసినా బెంగళూరు రాత మారలేదు. విజయం దక్కలేదు. ఐదు మ్యాచ్‌లాడినా ఇంకా ఐపీఎల్‌లో బోణీ చేయలేదు. శుక్రవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోహ్లి (49 బంతుల్లో 84; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (32 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. లిన్ (31 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా పునాది వేయగా రసెల్ (13 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) చుక్కల్ని చేరే షాట్లతో గెలిపించాడు. సైనీ, నేగి చెరో 2 వికెట్లు తీశారు. రసెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యంగా ఆడింది. చేతికొచ్చిన క్యాచుల్ని విడిచిపెట్టడం, పరుగు కష్టమయ్యే చోట ఓవర్‌త్రో 5 పరుగులివ్వడం. బౌలర్లు లయతప్పడం రాయల్ చాలెంజర్స్‌ను నిండా ముంచేశాయి.
ఇద్దరు కలిశారు... అందర్నీ బాదేశారు
టాస్ నెగ్గిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు కోహ్లి, పార్థివ్ పటేల్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) ధాటిగా శ్రీకారం చుట్టారు. ప్రసి«ద్ కృష్ణ వేసిన తొలి ఓవర్లో పార్థివ్ ఒక ఫోర్, కోహ్లి 2 ఫోర్లు కొట్టారు. తర్వాత ఐదో ఓవర్‌ను పూర్తిగా కోహ్లినే పూర్తిగా ఆడాడు. 3 బౌండరీలతో 13 పరుగులొచ్చాయి. తర్వాత స్పిన్నర్లు చావ్లా, నితీశ్ రాణా కుల్దీప్, నరైన్‌లు చక్కగా బంతులు వేయడంతో 6,7,8,9 ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. దీంతో స్కోరు వేగం తగ్గింది.
ఫోర్లు... సిక్సర్లే...
ఇక 14వ ఓవర్ నుంచి ఆట విధ్వంసరూపంలోకి వచ్చింది. రసెల్ వేసిన ఆ ఓవర్లో డివిలియర్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. తర్వాత బౌలర్లే మారారు. కానీ బౌండరీలు మాత్రం షరామామూలుగా వచ్చేశాయి. రాణా 15వ ఓవర్లో కోహ్లి ఫోర్, సిక్స్ కొడితే డివిలియర్స్ మరో సిక్సర్ బాదాడు. తర్వాత ప్రసి«ద్ కృష్ణ బౌలింగ్‌లో డివిలియర్స్ 2 బౌండరీలు కొట్టాడు. కోహ్లి 31 బంతుల్లో ఫిఫ్టీ (7 ఫోర్లు) పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ‘మిస్టర్ 360’ 28 బంతుల్లో అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు. 17వ ఓవర్ వేసిన ఫెర్గుసన్‌నూ ఇద్దరు చితగ్గొట్టారు. మొదట కోహ్లి 6, 4 కొడితే ఆఖరి బంతిని డివిలియర్స్ సిక్సర్‌గా మలిచాడు. 18వ ఓవర్లో కుల్దీప్ ఎట్టకేలకు కోహ్లిని పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లోనే డివిలియర్స్‌ను నరైన్ ఔట్ చేయగా... ఆఖరి ఓవర్లో స్టొయినిస్ 4, 6, 2, 6తో మొత్తం 18 పరుగులు పిండుకున్నాడు.
రాణించిన లిన్
కోల్‌కతా పరుగుల ఛేదన కూడా అంతేధాటిగా మొదలైంది. సౌతీ తొలి ఓవర్లో లిన్ 11 పరుగులు చేస్తే ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. దీంతో ఒక్క ఓవర్లోనే 17 స్కోరు చేసింది. రెండో ఓవర్లో నరైన్ (10)ను సైనీ ఔట్ చేశాడు. కానీ ఆ ఓవర్లోనూ 11 పరుగులు రావడంతో 2 ఓవర్లలోనే నైట్‌రైడర్స్ 28/1 స్కోరుకు చేరుకుంది. రాబిన్ ఉతప్ప (25 బంతుల్లో 33; 6 ఫోర్లు) క్రీజులోకి రాగా... సౌతీ వేసిన ఐదో ఓవర్లో లిన్ 2 బౌండరీలు, చహల్ మరుసటి ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. సిరాజ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. 10వ ఓవర్లో పవన్ నెగి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఉతప్పను ఔట్ చేశాడు. కేవలం 2 పరుగులిచ్చాడు. లిన్‌కు నితీశ్ రాణా జతయ్యాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో లిన్ భారీ షాట్ బాదగా బౌండరీ లైన్ వద్ద సులభమైన క్యాచ్‌ను సిరాజ్ నేలపాలు చేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే నేగి... లిన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత రాణా (23 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు జతచేశాడు. ఇతని జోరుకు చహల్ బ్రేక్ వేయగా... ఫోర్, సిక్స్‌తో ఊపుమీదున్న కార్తీక్‌ను సైనీ పెవిలియన్ చేర్చాడు.
రసెల్ మోత...
కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సివుండగా... మొదట 18వ ఓవర్ వేసిన సిరాజ్ రెండు డాట్ బంతుల్ని వేశాడు. కానీ తర్వాత వరుస బంతుల్ని బీమర్లుగా వేశాడు. అందులో ఒకటి సిక్సర్‌గా వెళ్లింది. అంపైర్ సిరాజ్‌ను తప్పించడంతో స్టొయినిస్ బౌలింగ్‌కు దిగాడు. రసెల్ మరో 2 సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఇక 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సివుండగా... సౌతీ వేసిన 19వ ఓవర్లో రసెల్ విశ్వరూపం చూపెట్టాడు. 6, 6, 6, 4, 6 బాదెయ్యడంతో 29 పరుగులు వచ్చాయి. విజయసమీకరం 6 బంతుల్లో 1 పరుగు కాగా.. నేగి బంతి వేయగానే శుభ్‌మాన్ గిల్ ఆ ఒక్కటి పూర్తి చేయడంతో భారీ లక్ష్యం బద్దలైంది. విజయం నైట్‌రైడర్స్ వశమైంది.
►ఇప్పటి వరకు లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రసెల్ 77 బంతులు ఎదుర్కొని 268.83 స్ట్రైక్ రేట్‌తో 207 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment