టోక్యో: ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేయడంతో విశ్వక్రీడలపై అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బయటికి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ... లోలోపల గుబులు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్– 19 కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇరుగుపొరుగు దేశాలకు వెళ్లాలన్నా ఎన్నో ఆంక్షలున్నాయి. ఇక సుదూర దేశాలకు పయనం దాదాపు గగనమే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు టోక్యోకు వెళతారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆడేవాళ్లెంత మంది? ధైర్యం చేసి విదేశీయులు వెళ్లడానికి సిద్ధమైనా... జపాన్ వాసుల్లో ఇప్పుడిప్పుడే అసహనం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే... ప్రతిష్టకు పోయి విదేశీయుల రాక వల్ల తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకోవడం ఎందుకని జపనీయులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మా ప్రాణాలతో ఈ ‘ఆట’లొద్దు
కోవిడ్–19 జపాన్‌లోనూ జడలు విప్పింది. అధికారిక సమాచారం మేరకు 814 మంది కరోనా బాధితులుండగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. ఒలింపిక్స్ నేపథ్యంలో కరోనా కేసుల్ని తక్కువగా చూపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యూరప్ దేశాల కంటే ముందుగానే జపాన్‌కు కరోనా వైరస్ వ్యాపించింది. అందువల్ల బాధితులు ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. టోక్యోకు చెందిన 27 ఏళ్ల ఉద్యోగి కొకి మురా మీడియాతో మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా... జపాన్ ఈ కరోనా కల్లోలం నుంచి త్వరగా బయటపడినా సరే, మెగా ఈవెంట్ కోసం విదేశీయుల రాకను ఎంతమాత్రం కోరుకోం. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఈ ఈవెంట్‌ను నిర్వహించకపోవడమే మంచిది’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది అతని ఒక్కడి మాటలే కాదు... కరోనా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో జపనీయులంతా ఇప్పుడిదే కోరుకుంటున్నారు. ఓ ఆటల వేడుక కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఓ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వెయ్యి మందిలో 70 శాతం మంది (700 మంది జపాన్ వాసులు) ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకంగానే ఉన్నారు. మిగతా వారేమో వాయిదా వేస్తేనే మంచిదని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment