రెండో రోజు బౌలర్లదే హవా
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలర్ల హవా కొనసాగింది. నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుసుగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా 408 పరుగులకే పరిమితమైంది. అయితే అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 52 ఓవర్లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లను చేజార్చుకుంది.
తొలి రోజు బ్యాట్స్ మెన్ ల హవా కొనసాగినా.. రెండో రోజు ఆటలో మాత్రం బౌలర్లు చెలరేగిపోయారు. ఈ రోజు ఆటలో మొత్తం మీద 10 వికెట్లు నేలరాలడం విశేషం. రెండో రోజు తన తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ స్వల్వ వ్యవధిలో కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(29)పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరగగా, అతని స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన షేన్ వాట్సన్ (25) పరుగులు మాత్రమే పెవిలియన్ చేరాడు. తరువాత ఆసీస్ ను రోజర్స్ (55), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(65*) పరుగులతో ఆదుకున్నారు
ప్రస్తుతం 221 పరుగులకు నాలుగు వికెట్ల కోల్పోయిన ఆసీస్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ కంటే 187 పరుగుల వెనకబడి ఉంది. ఇంకా చేతిలో ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో మూడు రోజు ఆట మరింత రసవత్తరంగా జరగనుంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు మూడు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది.