సందడి మొదలైంది...
ముంబై కెప్టెన్‌గా పొలార్డ్
గాయంతో రోహిత్‌శర్మ లీగ్ నుంచి తప్పుకోవడంతో కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ముంబైకి నాయకత్వం వహించేందుకు పొలార్డ్ సరైన వ్యక్తి అని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్, సీఎల్‌టి20 కలిపి 96 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 1700 పరుగులు చేశాడు.
- ప్రాక్టీస్‌లో మునిగిన ఆటగాళ్లు
- ముంబై ఇండియన్స్‌పైనే అందరి దృష్టి
- రేపటి నుంచి క్వాలిఫయర్స్
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ దశలో ఇప్పుడు అందరి దృష్టీ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది. రెండు సార్లు ఈ టోర్నీ చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సారి అర్హత పోటీల్లో పాల్గొంటోంది. ఈ దశలో పోటీ పడుతున్న మిగతా మూడు జట్లతో పోలిస్తే స్టార్ ఆటగాళ్లు, భారీ హిట్టర్లు ముంబై టీమ్‌లోనే ఉండటంతో అభిమానులు జట్టు మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే జట్టు రాయ్‌పూర్ చేరుకుంది.
మెంటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఆటగాళ్లంతా రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన రాయ్‌పూర్‌కు ఇప్పుడు మళ్లీ క్రికెట్ కళ వచ్చింది. టోర్నీలో భాగంగా ఆరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో పాటు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఇక్కడి షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియంలో జరగనున్నాయి. గురువారం ప్రాక్టీస్ చేసిన అనంతరం కొంతమంది ఆటగాళ్లు రాయ్‌పూర్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గెలిస్తే గ్రూప్ ‘బి’లోకి...
లాహోర్ లయన్స్, సదరన్ ఎక్స్‌ప్రెస్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్లు తొలిసారి లీగ్ బరిలోకి దిగుతున్నాయి. క్వాలిఫయింగ్ బరిలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్రధాన పోటీలకు అర్హత సాధిస్తే ఆ జట్టు గ్రూప్ ‘బి’ బరిలోకి దిగుతుంది. ఈ గ్రూప్‌లో మరో భారత జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉంది. గ్రూప్ ‘ఎ’లో ఇప్పటికే కోల్‌కతా, చెన్నై ఉండటంతో మరో భారత జట్టును చేర్చకుండా షెడ్యూల్ రూపొందించారు.
తప్పుకున్న దిల్షాన్
లీగ్ ఆరంభానికి ముందే శ్రీలంక జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే ఈ టీమ్ కీలక బౌలర్ మలింగ, సీఎల్‌టి20లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకోవడంతో జట్టు బలహీనంగా మారింది. టీమ్‌కు కెప్టెన్‌గా జీహాన్ ముబారక్‌ను ఆ జట్టు ప్రకటించింది.