అడిలైడ్ : భారత్‌తో ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌లో గెలుపుకోసం కష్టపడాలని, కానీ నిజాయితీగా ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నూతన ఛైర్మన్ ఈర్ల్ ఎడ్డింగ్స్ ఆ జట్టు ఆటగాళ్లను కోరారు. డేవిడ్ పీవర్ నుంచి సీఏ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎడ్డింగ్స్.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. సిరీస్‌లో ఓడినా గెలిచినా నిజాయితీగా ఆడాలని జట్టు ఆటగాళ్లకు సూచించారు.
‘బాగా ఆడండి. కష్టపడండి. గెలుపు కోసం సాయశక్తులా శ్రమించండి. ఆటకు గౌరవమిస్తూ గెలిచినా.. ఓడినా నిజాయితీగా ఆడండి. యువకులతో మా జట్టు బాగుంది. వారు విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది. వారిని నేను కోరేది ఒక్కటే.. సహజ సిద్దమైన ఆటతో కష్టపడండి.. విజయం అదే వరిస్తుంది. ప్రస్తుతం ఆసీస్ మొత్తం అదే కోరుకుంటుంది’ అని తెలిపారు. మాములుగా ఆసీస్‌తో సిరీస్ అంటే అందరికి స్లెడ్జింగ్ గుర్తుకొస్తొంది. అయితే స్లెడ్జింగ్ కారణంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆజట్టును కోలుకోలేకుండా చేసింది. దీంతోనే భారత్‌తో సిరీస్‌కు ముందు నిజాయితీగా ఆడాలని, వివాదాల జోలికి వెళ్లొద్దని సీఏ ఆటగాళ్లకు సూచిస్తోంది.
ఇక బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆ జట్టు ఆటగాళ్లు బెన్ క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మీత్‌లు దూరమైన విషయం తెలిసిందే. ఈ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచంలో పెను దుమారాన్ని సృష్టించింది. ఈ ఘటనతోనే సీఏలో చోటుచేసుకున్న తదనాంతర పరిణామాలతో ఎడ్డింగ్స్‌కు సీఏ ఛైర్మన్ పదవి వరించింది. భవిష్యత్తు డేనైట్ టెస్ట్‌లదేనని, అడిలైడ్ టెస్ట్‌నే దానికి వేదిక చేద్దామని భావించామని కానీ పర్యాటక జట్టు అంగీకరించలేదని ఎడ్డింగ్స్ చెప్పుకొచ్చారు. ఇక టీ20 సిరీస్ సమమైనప్పటికీ.. కోహ్లిసేన ఆధిపత్యం కనబర్చింది. ఇదే ఉత్సాహంతో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment