సన్‌రైజర్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ | CSK beat Sunrisers by 8 wickets | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌

Published Sun, May 13 2018 7:36 PM | Last Updated on Sun, May 13 2018 9:31 PM

CSK beat Sunrisers by 8 wickets - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌​ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో వరుసగా ఆరు విజయాల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది.  చెన్నై ఆటగాళ్లలో అంబటి రాయుడు(100 నాటౌట్‌; 62బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్‌ చరిత్రలో తొలి సెంచరీ సాధించగా, షేన్‌ వాట్సన్‌(57) బాధ్యతాయుతంగా ఆడాడు. ఫలితంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 19 ఓవర్లలో రెండు వికెట్లు  కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ తాజా విజయంతో చెన్నై దాదాపు ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి చెన్నైను పటిష్ట స్థితికి చేర్చిన తర్వాత వాట్సన్‌ ఔటయ్యాడు. ఆపై మూడు పరుగుల వ్యవధిలో రైనా(2) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఎంఎస్‌ ధోని-రాయుడుల జోడి మిగతా పనిని పూర్తి చేసింది. ధోని (20 నాటౌట్‌; 14బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) సమయోచితంగా ఆడాడు.

అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(79;49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలియమ్సన్‌(51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మరోసారి మెరవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌(2) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌తో కలిసి కేన్‌ విలియమ‍్సన్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు.  వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే ముందుగా ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై విలియమ్సన్‌ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే జట్టు స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా ధావన్‌(79;49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలియమ్సన్‌(51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వరుసగా పెవిలియన్‌ చేరారు. ముందుగా డ్వేన్‌ బ్రేవో వేసిన16 ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ ఔట్‌ కాగా, ఆపై శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 17 ఓవర్‌ తొలి బంతికి విలియమ్సన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే(5) నిరాశపరిచాడు. ఇక దీపక్‌ హుడా(21 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌‌) ఫర్వాలేదనిపించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement