భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నా: సచిన్
న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి తప్పుకున్నా... సాధారణ ప్రజల కోసం తాను పని చేస్తూనే ఉంటానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. వాళ్ల ముఖాల్లో ఆనందం చూసేందుకు కృషి చేస్తానన్నాడు. భారత్‌లాంటి అందమైన దేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నానని చెప్పాడు.
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును మాస్టర్ అందుకున్నాడు. ‘నా వరకు ఇది చాలా గొప్ప గౌరవం. దీన్ని స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో జన్మించినందుకు చాలా గర్విస్తున్నా. ఇన్నాళ్లూ నాకు మద్దతుగా నిలిచి ప్రేమాభిమానాలు కురిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.
తన తల్లితో పాటు బిడ్డల జీవితాలను తీర్చిదిద్దేందుకు త్యాగాలు చేస్తున్న ప్రతి తల్లికీ ఈ అవార్డును అంకితమిస్తున్నానని చెప్పాడు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు, సచిన్ భార్య అంజలి, కూతురు సారాలతో పాటు ఇతర అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ప్రొఫెసర్ సీఎన్ రావు కృషి అమోఘమని కితాబిచ్చిన సచిన్ ఆయనకూ శుభాకాంక్షలు తెలిపాడు.
సచిన్‌కు అర్హత ఉంది: శుక్లా
భారతరత్న అవార్డుకు సచిన్ అన్ని విధాలా అర్హుడని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. ఈ అవార్డును ప్రకటించిన యూపీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి తాను సాక్షిగా నిలిచినందుకు గర్వపడుతున్నానన్నారు. ‘సచిన్ హోదాను పక్కనబెడితే... అతను చాలా సింపుల్‌గా ఉంటాడు.
అత్యద్భుతమైన వ్యక్తి. క్రికెట్‌లో అతను సాధించిన రికార్డులు అమోఘం. వాటి కోసం మాస్టర్ చేసిన కృషి మరువలేనిది. రాబోయే 100 ఏళ్లలో కూడా ఈ రికార్డులు బద్దలు కొట్టలేరు. యావత్ జాతి సెంటిమెంట్‌ను యూపీఏ ప్రభుత్వం అర్థం చేసుకుని అవార్డును ప్రకటించినందుకు కృతజ్ఞతలు’ అని శుక్లా పేర్కొన్నారు.