మూడు ఫార్మాట్లకు అతడే కెప్టెన్
కేప్టౌన్: ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ కెప్టెన్ పదవికి ఏబీ డివిలియర్స్ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతని స్థానంలో డు ప్లెసిస్ ను కెప్టెన్ గా నియమించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డు ప్లెసిస్ ను వన్డే కెప్టెన్ గా నియమిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా టెస్టు, ట్వంటీ 20లతో పాటు వన్డేలకు కూడా డు ప్లెసిస్ దక్షిణాఫ్రికా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డు ప్లెసిస్.. సారథిగా జట్టును మరింత ముందుకు తీసుకెళతాడని సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హారూన్ లోర్గాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ తో ట్వంటీ 20 సిరీస్ లో భాగంగా వరల్డ్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్ గా డు ప్లెసిస్ ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనంగా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ డు ప్లెసిస్ కు కెప్టెన్ గా తొలి వన్డే సిరీస్. గత నెల్లో ఏబీ డివిలియర్స్ వన్డే కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు దక్షిణాఫ్రికా కెప్టెన్ గా వ్యవహరించిన ఏబీ.. కేవలం ఆటగాడిగా మాత్రమే సెలక్టర్లకు అందుబాటులో ఉండనున్నారు.