ఫ్రాన్స్‌ను ఆపతరమా!
గ్రూప్-ఇ విశ్లేషణ
స్విట్జర్లాండ్, ఈక్వెడార్, ఫ్రాన్స్, హోండురస్
ప్రపంచకప్‌లోని ఫేవరెట్ జట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈసారి కచ్చితంగా గెలవాలనే ధృఢ సంకల్పంతో ఈ జట్టు సన్నద్ధమవుతోంది. దీనికి తగ్గట్లే గ్రూప్ దశ ఫ్రాన్స్‌కు నల్లేరు మీద నడకే. స్విట్జర్లాండ్‌ను మినహాయిస్తే... ఈక్వెడార్, హోండురస్‌ల నుంచి ఫ్రాన్స్‌కు కనీసం పోటీ కూడా ఎదురుకాకపోవచ్చు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడితే గ్రూప్ దశను ఫ్రాన్స్ అగ్రస్థానంతో ముగించేలా అవకాశం ఉంది.
ఫ్రాన్స్
1998 ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టుకు మిడ్ ఫీల్డ్ ప్రధాన బలం. స్టార్ మిడ్ ఫీల్డర్ రిబెరీ దూరమైనా యువ ఆటగాడు పాల్ పోగ్బా రాణించే అవకాశం ఉంది. 2002లో సెనెగల్ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఆ టోర్నీలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2010లో మెక్సికో, దక్షిణాఫ్రికా చేతిలో ఓడి ఉరుగ్వేతో డ్రా చేసుకుని నాకౌట్‌కు చేరలేకపోయింది. ఇక 2006లో జినెదిన్ జిదాన్ మెరుపులతో కచ్చితంగా ట్రోఫీ గెల్చుకుంటుందని భావించారు. ఎక్స్‌ట్రా సమయంలో అనూహ్యంగా ఇటలీ ఆటగాడు మాటెరాజ్జీ రెచ్చగొట్టడంతో జిదాన్ తలతో కొట్టి రెడ్ కార్డ్ బారిన పడి మైదానం వీడాడు. ఇది జట్టు ఫలితాన్ని ప్రభావితం చేసింది. పెనాల్టీ షూటౌట్‌లో 3-5తో ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. 1998 నుంచి ప్రతీ టోర్నీని గమనిస్తే... గెలిస్తే టైటిల్ లేదంటే ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకుండా ఇంటి దారి పడుతున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే ఈ జట్టు ఫైనల్స్‌కు చేరాలి.
కీలక ఆటగాళ్లు: మిడ్ ఫీల్డర్లు పాల్ పోగ్బా, మటౌడీ, స్ట్రయికర్ కరీమ్ బెంజెమా.
అర్హత సాధించారిలా: ఊఫా క్వాలిఫయింగ్ గ్రూప్ ఐలో స్పెయిన్ కన్నా మూడు పాయింట్లు వెనకాల నిలిచిన ఫ్రాన్స్ రెండో అంచె ప్లే ఆఫ్‌లో ఉరుగ్వేతో ఆడింది. తొలి మ్యాచ్‌లో 0-2తో ఓడగా రెండో మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. దీంతో ఎక్కువ గోల్స్ ఆధారంగా ఫ్రాన్స్ గట్టెక్కి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. అంచనా: స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీస్‌కు చేరవచ్చు.
ఫిఫా ర్యాంకు: 8, కోచ్: డీడియర్ డెషాంప్స్
ఈక్వెడార్
2002లో జపాన్‌లో జరిగిన టోర్నీలో ఈ జట్టు తొలిసారిగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. అయితే రెండో ప్రయత్నంలోనే 2006లో నాకౌట్ దశకు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో ఆతిథ్య జర్మనీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కానీ ఇంగ్లండ్ చేతిలో ఓడి క్వార్టర్స్‌కు చేరలేకపోయింది. 2010లో టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. గతేడాది ఓ క్లబ్ తరఫున ఆడుతూ గుండెపోటుతో మరణించిన స్ట్రయికర్ క్రిస్టియన్ బెనెటిజ్ లేని లోటును అధిగమించడం జట్టుకు పెను సవాలే.
అర్హత సాధించారిలా: కాన్మెబోల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో నాలుగో స్థానం పొంది బ్రెజిల్ టిక్కెట్ దక్కించుకుంది. ఉరుగ్వే కూడా ఇదే స్థానంలో ఉన్నా మెరుగైన గోల్స్ ఆధారంగా గట్టెక్కింది.
కీలక ఆటగాళ్లు: స్ట్రయికర్ ఫెలిప్ కెసైడో, మిడ్ ఫీల్డర్లు ఆంటోనియా వాలెన్సియా, క్రిస్టియన్ నొబోవా
అంచనా: గ్రూప్ దశ దాటకపోవచ్చు; ఫిఫా ర్యాంకు: 42; కోచ్: రినాల్డో ర్యూడా
రిబెరీ అవుట్
ఫ్రాన్స్ జట్టుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ మిడ్ ఫీల్డర్ ఫ్రాంక్ రిబెరీ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న తను కొద్ది రోజులుగా వ్యక్తిగత శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అయితే తుది జట్టును ప్రకటించే ముందు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంలో రిబెరీ విఫలమయ్యాడు.
అతడికి విశ్రాంతి అవసరమని టెస్టుల్లో తేలింది. బంతిని అద్భుత రీతిలో అదుపులో ఉంచుకునే 31 ఏళ్ల రిబెరీ గత నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే తన చివరి ప్రపంచకప్‌గా చెప్పుకొచ్చాడు. అయితే గాయం అతడి కోరికను అడ్డుకుంది. అలాగే మిడ్ ఫీల్డర్ క్లెమెంట్ గ్రేనియర్ కూడా గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు.
స్విట్జర్లాండ్
ఈ గ్రూపులో ఉన్న రెండో పటిష్ట జట్టు. ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ప్రపంచకప్‌లో ఆడింది. చివరిసారిగా 1954లో సొంత గడ్డపై జరిగన టోర్నీలో క్వార్టర్స్ దశకు చేరిన ఈ జట్టు ఓవరాల్‌గా మూడుసార్లు ఈ ఘనత సాధించింది. గత టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌ను తమ తొలి మ్యాచ్‌లోనే ఓడించి సంచలనం సృష్టించింది. అయితే ఓ ఓటమి, డ్రాతో స్విస్ జట్టు గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. అండర్-17 ప్రపపంచకప్ (2007) గెలుచుకున్న ఆటగాళ్లలో చాలా మంది ఇప్పుడు జట్టులో ఉండడం కలిసివచ్చే అంశం.
అర్హత సాధించారిలా: ఊఫా క్వాలిఫై మ్యాచ్‌ల్లో ఆడిన పదింటిలో ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో నిలిచింది. దీంతో నేరుగా బ్రెజిల్‌కు అర్హత సాధించింది.
కీలక ఆటగాళ్లు: మిడ్ ఫీల్డర్లు హెడ్రాన్ షాకిరి, గోఖన్ ఇన్లెర్, డిఫెండర్ ఫాబియన్ షాయెర్.
అంచనా: నాకౌట్ దశకు చేరుతుంది; ఫిఫా ర్యాంకు: 35; కోచ్: ఒట్‌మర్ హిజ్‌ఫెల్డ్.
హోండురస్
1982లో తొలిసారిగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఈ జట్టు దాదాపు మూడు దశాబ్దాల అనంతరం 2010లో అర్హత సాధించింది. ఈ రెండు సార్లు గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. కొత్త కోచ్ ఫెర్నాండో సారెజ్ రాకతో జట్టులో నిలకడ వచ్చింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో అర్హత మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వగలిగింది.
అర్హత సాధించారిలా: కోన్‌కాకాఫ్ నాలుగో రౌండ్‌లో ఈ జట్టు పది మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. దీంతో టోర్నీకి అర్హత సాధించింది.
కీలక ఆటగాళ్లు: ఎమిలియో ఇజగిరే, విల్సన్ పలాసియస్, జె ర్రీ బెంగ్‌సన్
అంచనా: గ్రూప్ దశలోనే వెనక్కి రావచ్చు; ఫిఫా ర్యాంకు: 51; కోచ్: లూయిస్ ఫెర్నాండో సారెజ్