నేను కావాలని చేయలేదు: హార్దిక్
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవడం కన్నా.. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా కారణంగా హార్దిక్ పాండ్యా ఔటయిన తీరే అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పరుగు కోసం జడేజా ఇచ్చిన పిలుపుతో క్రీజ్ ను వదిలి ముందుకు కదిలిన పాండ్యా అనవరసరంగా రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో జడేజా తీరుపై పాండ్యా బాహబాటంగానే అసహనం వ్యక్తం చేశాడు. తాను చేయని పొరపాటుకు అవుట్ కావాల్సి వచ్చిందనే కారణంతో తిట్టుకుంటూ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మమ్మల్ని మేము మోసం చేసుకున్నామంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆపై ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. ఆ రనౌట్ తరువాత తాను ప్రవర్తించిన తీరుపై పాండ్యా వివరణ ఇచ్చాడు.
'నేను తరచు ఆవేశానికి లోనవుతుంటా. ఇది నా జీవితంలో భాగంగా మారిపోయినట్లుంది. నేను తొందరగా ఉద్రేక పడిపోతా.. వెంటనే కూల్ అవుతా. ఆ రెండింటికి మూడు నిమిషాలు సమయం మాత్రమే ఉంటుంది. మూడు నిముషాల్లో నేను సాధారణ స్థితికి వచ్చేస్తా. అదే తరహాలో రనౌట్ విషయంలో కూడా ఆవేశంతో రగిలిపోయా. ఇక్కడ ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తరువాత నన్ను నేను చూసుకుని నవ్వుకున్నా. ఆ నా ప్రవర్తనకు తీవ్రమైన నిరాశకు లోనయ్యా. కానీ క్రీడలో ఇదంతా భాగమే'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.