బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. జట్టుకు కీలకమైన సమయంలో క్యాచ్ అందుకుని పర్యాటక ఆసీస్ జట్టును దెబ్బతీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్‌తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం ఇరువురు అర్దసెంచరీలు పూర్తిచేశారు.
ఈ జోడి మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి టీమిండియాకు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రవీంద్ర జడేజా వీరిద్దరిని విడదీశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 32 ఓవర్ మూడో బంతిని లబుషేన్ కవర్ వైపు భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి కళ్లు చెదిరేరీతిలో డైవ్ చేస్తూ రెండు చేతులా బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో లబుషేన్ షాక్‌తో క్రీజు వదిలి వెళ్లాడు. కోహ్లి క్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా ఆనందంలో మునిగిపోయారు. లబుషేన్ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టార్క్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment