సిరీస్పై కన్నేసిన విరాట్ సేన
సెయింట్ లూసియా:వెస్టిండీస్తో జరిగిన గత టెస్టు మ్యాచ్ను డ్రాతో సరిపెట్టుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ గెలిచిన భారత క్రికెట్ జట్టు.. మూడో టెస్టులో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి గం.7.30ని.లకు గ్రాస్ ఐస్లెట్లోని డారెన్ స్వామీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. విరాట్ నేతృత్వంలోని భారత జట్టు..రేపట్నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ ను గెలిస్తే హ్యాట్రిక్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. గతేడాది విరాట్ నేతృత్వంలోని భారత జట్టు.. శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై వరుస సిరీస్ లను సాధించిన సంగతి తెలిసిందే.
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో విజయం అంచులవరకూ వచ్చినా ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచి విండీస్ ను గట్టెక్కించాడు. మరోవైపు సుమారు ఒక రోజు పాటు మ్యాచ్ వర్షార్పణం కావడం కూడా భారత్ ఫలితంపై ప్రభావాన్ని చూపింది. అయితే గత టెస్టుల్లో అవలంభించిన ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల ఫార్ములాకే విరాట్ ఓటేసి అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మరోసారి రవీంద్ర జడేజాకు ఆడే అవకాశం దక్కకపోవచ్చు.
ఈ స్టేడియంలో ఇప్పటివరకూ నాలుగు టెస్టు మ్యాచ్లు జరగ్గా ఒక దాంట్లో మాత్రమే ఫలితం వచ్చింది. 2003లో ఈ స్టేడియానికి టెస్టు హోదా లభించగా, 2006 పర్యటనలో మాత్రమే భారత్ ఇక్కడ చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో జరిగిన ఆ మ్యాచ్ను భారత్ డ్రాతో ముగించింది. 2014లో ఇక్కడ బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది. ఈ నేపథ్యంలో విరాట్ సేనకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
మూడో టెస్టుకు విండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఓపెనర్ రాజేంద్ర చంద్రిక స్థానంలో షాయ్ హోప్ను తుది జట్టులోకి తీసుకునే ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా, భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ దూరం కావడంతో ఆ స్థానంలో కేఎల్ రాహుల్ అవకాశం లభించింది. దాన్ని చక్కగా వినియోగించుకున్న రాహుల్ శతకంతో మెరిశాడు. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టులో మార్పులు చేయకపోవచ్చు.