ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్– 19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత అండర్–19 జట్టు సభ్యుడు యశస్వి జైస్వాల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్ (4/13)లో విజృంభించిన యశస్వి... అనంతరం ఓపెనర్‌గా (56 బంతుల్లో 89 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. ఫలితంగా శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా అనధికారిక 3 వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 29.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆతి థ్య జట్టు తరఫున జొనాథన్ బర్డ్ చేసిన 25 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం.
యశస్వికి ఆకాశ్ సింగ్ (2/37), అథర్వ అన్కోలేకర్ (2/16), రవి బిష్ణోయ్ (2/20) చక్కటి సహకారం అందించారు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన భారత్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధించింది. ఆరంభంలోనే సారథి ప్రియమ్ గార్గ్ (0), రావత్ (2) వికెట్లను కోల్పోయినా... ఓపెనర్ జైస్వాల్ టి20 తరహాలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తోడవటంతో భారత విజయం ఖాయమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన యశస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభి ంచింది. చివరి వన్డే ఈ నెల 30న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment