భారత్ ‘డబుల్’ ధమాక
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ రెండో డివిజన్ టైటిల్స్ సొంతం
కౌలాలంపూర్: భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు కొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండో డివిజన్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించాయి. శనివారం జరిగిన రెండో డివిజన్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 3-2తో బ్రెజిల్‌ను ఓడించగా... భారత మహిళల జట్టు 3-1తో లక్సెంబర్గ్‌పై విజయం సాధించింది. ఫైనల్స్‌కు చేరుకున్న భారత పురుషుల, మహిళల జట్లతోపాటు బ్రెజిల్, లక్సెంబర్గ్ కూడా 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్-24 జట్లు పాల్గొనే ‘చాంపియన్‌షిప్’ డివిజన్‌కు అర్హత సాధించాయి. చాంపియన్‌షిప్ డివిజన్‌కు అర్హత పొందడం భారత టీటీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున హర్మీత్ దేశాయ్ రెండు మ్యాచ్‌ల్లో గెలువగా... సౌమ్యజిత్ ఘోష్ మరో మ్యాచ్‌లో నెగ్గాడు. తొలి మ్యాచ్‌లో సౌమ్యజిత్ 13-15, 4-11, 7-11తో హుగో కాల్డెరానో చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో హర్మీత్ 11-3, 8-11, 8-11, 11-8, 11-9తో కజువో మత్సుమోటోపై నెగ్గాడు. మూడో మ్యాచ్‌లో ఆంథోనీ అమల్‌రాజ్ 11-8, 7-11, 11-5, 9-11, 9-11తో థియాగో మోంటీరో చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో సౌమ్యజిత్ 11-6, 14-12, 11-9తో కజువో మత్సుమోటోపై గెలవడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4-11, 11-5, 15-13, 11-6తో హుగో కాల్డెరానోపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది.
లక్సెంబర్గ్‌తో జరిగిన మహిళల విభాగం ఫైనల్లో తొలి మ్యాచ్‌లో మౌమా దాస్ 11-1, 11-4, 13-11తో డానియెలాపై, రెండో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-6, 11-2, 9-11, 13-11తో టెస్సీ గొండెరింగర్‌పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో షామిని 4-11, 9-11, 9-11తో సారా డు నెట్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 11-4, 11-8తో డానియెలాపై నెగ్గడంతో భారత్‌కు 3-1తో విజయం దక్కింది. ఈ పోటీల్లో భారత మహిళల జట్టు అజేయంగా నిలువడం విశేషం.