న్యూఢిల్లీ: ఈ నెల 24న జరగాల్సిన భారత్-వెస్టిండీస్ జట్ల రెండో వన్డే మ్యాచ్ ఇండోర్ నుంచి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ టికెట్ల విషయంలో మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ)కి, బీసీసీఐకి మధ్య తలెత్తిన విభేదాలే ఇందుకు కారణం. బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం మొత్తం టికెట్లలో 90 శాతం విక్రయానికి పెట్టాలి.. ఇక 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాలి. రెండో వన్డేకు ఆతిథ్యమివ్వాల్సిన హోల్కర్ స్టేడియం కెపాసిటీ 27 వేలు. దీంతో 2700 టికెట్లు మాత్రమే కాంప్లిమెంటరీలు మిగులుతున్నాయి. మరొకవైపు పెవిలియన్ (హాస్పిటాలిటీ) గ్యాలరీలో 7000 సీట్లు మాత్రమే ఉండగా, అందులో కూడా బీసీసీఐ భాగం కోరుతుంది. స్పాన్సర్లకు, ప్రకటనదారులకు టికెట్లు కేటాయించాలని బీసీసీఐ కోరడంతో అది ఎంపీసీఏకి చిర్రెత్తుకొచ్చింది.
ఇలా అయితే మ్యాచ్‌ను నిర్వహించలేమని పేర్కొంది. దాంతో రెండో వన్డే ఇండోర్‌లో జరగడంపై సందిగ్ధిత నెలకొంది. టీమిండియాతో వెస్టిండీస్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌తో పాటు ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 4వ తేదీన రాజ్‌కోట్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్ టెస్టు రికార్డు దారుణంగా ఉంది. ఈ పద్దెనిమిదేళ్లలో భారత్‌తో ఇంటా బయటా ఏడు సిరీస్‌ల్లో తలపడింది. 2001–02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2–1తో నెగ్గింది. తర్వాతి ఆరు సిరీస్‌లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం తమ దగ్గరే జరిగిన సిరీస్‌లో 0–2తో ఓడింది. ఇందులో ఒకటి ఇన్నింగ్స్ ఓటమి కాగా మరోదాంట్లో ఏకంగా 237 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒక్క టెస్టును మాత్రమే డ్రా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment