‘రూట్’ చూపించాడు | Joe Root's ton and Moeen Ali's unbeaten 99 take England to 311/4 at stumps on Day 1 of the first Test against India. | Sakshi
Sakshi News home page

‘రూట్’ చూపించాడు

Published Wed, Nov 9 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

‘రూట్’ చూపించాడు

‘రూట్’ చూపించాడు

జో రూట్ అద్భుత సెంచరీ 
ఇంగ్లండ్ 311/4
శతకానికి పరుగు దూరంలో మొయిన్
తొలి టెస్టు తొలి రోజు భారత్ విఫలం  

 
గత మూడేళ్ల కాలంలో భారత్‌లో ఏ విదేశీ క్రికెటర్ కూడా టెస్టుల్లో సెంచరీ చేయలేదు. డివిలియర్స్, ఆమ్లా, విలియమ్సన్ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్ కూడా ఈ ఘనత అందుకోలేకపోయారు. కానీ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్‌‌సతో ఈ కొరత తీర్చాడు. భారత్‌లో ఎలా ఆడాలో తన సహచరులతో పాటు ప్రపంచంలోని మిగిలిన క్రికెటర్లకు చూపించాడు. ఎక్కడా చిన్న తడబాటు లేదు... ఒక్క చిన్న తప్పు లేదు... స్వీప్, రివర్స్ స్వీప్, డ్రైవ్... ఒక్కటేంటి ఎన్ని రకాల షాట్లు ఆడాలో అన్నీ ఆడాడు. వెరసి... ఇంగ్లండ్ జట్టుకు భారత పర్యటనలో అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

 
మూడో బంతి, ఎనిమిదో బంతి, 35వ బంతి... ఇన్నింగ్‌‌స ఆరంభంలో పట్టుమని పాతిక పరుగులు కూడా చేయకుండా ప్రత్యర్థి ఆటగాళ్లు ఇచ్చిన మూడు లడ్డూల్లాంటి క్యాచ్‌లు వదిలేస్తే ఏమవుతుంది..? ఇదే అవుతుంది మరి. కెప్టెన్ అయ్యాక తొలిసారి టాస్ ఓడిపోయినా... భారత పేసర్లు ఆరంభంలో పరిస్థితులను వినియోగించుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేసినా... ఫీల్డర్లు సులభమైన క్యాచ్‌లు వదిలేసి ఆరంభంలో పట్టు బిగించే అవకాశాన్ని కోల్పోయారు. ఫలితంగా మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి రోజును భారత్ పేలవంగా ముగించింది.  
 
రాజ్‌కోట్: టాస్ గెలవడం, తొలుత బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేయడం... ఆ తర్వాత స్పిన్‌తో ప్రత్యర్థిని చిత్తు చేయడం... కోహ్లి కెప్టెన్ అయిన తర్వాత స్వదేశంలో కొనసాగుతున్న ఆనవాయితీ ఇది. కానీ ఈసారి ఆ ఆనవాయితీ మారింది. తొలిసారి ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచింది. భారత్‌లోని సంప్రదాయ వికెట్‌పై టాస్ గెలిచిన జట్టు తొలి రోజు ఎలా ఆడుతుందో ఇంగ్లండ్ అలాగే ఆడింది. ఫలితంగా సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌సలో 93 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

జో రూట్ (180 బంతుల్లో 124; 11 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్‌‌సతో సెంచరీ చేయగా... మొయిన్ అలీ (192 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. రూట్, అలీ నాలుగో వికెట్‌కు 179 పరుగులు జోడించి ఇంగ్లండ్ ఇన్నింగ్‌‌సను నిలబెట్టారు. ఓపెనర్లు కుక్ (21), తొలి టెస్టు ఆడుతున్న హమీద్ (31) ఫర్వాలేదనిపించారు. ఆట ముగిసే సమయానికి అలీతో పాటు స్టోక్స్ (41 బంతుల్లో 19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా... ఉమేశ్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
సెషన్ 1: పోటాపోటీగా...
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా... భారత్ ముగ్గురు స్పిన్నర్లు సహా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. దీంతో కరుణ్ నాయర్, హార్ధిక్ పాండ్యా ఇద్దరిలో ఒక్కరికి కూడా అరంగేట్రం అవకాశం రాలేదు. కుక్, ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హమీద్ ఇద్దరూ ఆరంభంలో భారత పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. వరుసగా తొలి రెండు ఓవర్లలో కుక్ ఇచ్చిన క్యాచ్‌లను రహానే, కోహ్లి వదిలేశారు. ఆరో ఓవర్లో హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను మురళీ విజయ్ నేలపాలు చేశాడు.

ఈ ఇద్దరూ కుదురుకున్నారని భావించిన సమయంలో... భారత స్పిన్నర్లు రంగంలోకి దిగారు. జడేజా బౌలింగ్‌లో కుక్ ఎల్బీగా అవుటైతే... హమీద్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రూట్ ఒక ఎండ్‌లో కుదురుగా ఆడినా... రెండో ఎండ్‌లో డకెట్ తడబడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో మూడు ఫోర్లతో దూకుడుగా కనిపించినా... తన బౌలింగ్‌లోనే రహానేకు స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సెషన్‌ను భారత్, ఇంగ్లండ్  సంతృప్తికరంగా ముగించాయి.
ఓవర్లు: 32.3; పరుగులు: 102; వికెట్లు 3
 
సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం    
రెండో సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కుక్, అలీ ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే స్ట్రయిక్ రొటేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో పరుగులు సులభంగా వచ్చాయి. 72 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెషన్ మొత్తం ఈ ఇద్దరూ భారత బౌలర్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. వికెట్ ఫ్లాట్‌గా ఉండటంతో భారత స్పిన్నర్లు ముగ్గురూ  ప్రభావం చూపలేకపోయారు.
ఓవర్లు: 31.3; పరుగులు: 107; వికెట్లు: 0
 
సెషన్ 3: ఇంగ్లండ్ ఆధిపత్యం
టీ విరామం తర్వాత 99 బంతుల్లో అలీ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... జో రూట్ 154 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ ఇద్దరూ తమ జోరును అలాగే కొనసాగించడంతో పరుగులు సులభంగా వచ్చాయి. జడేజా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన రూట్... కాస్త వేగం పెంచే ప్రయత్నం చేశాడు. అటు 80 ఓవర్ల తర్వాత కూడా భారత్ కొత్త బంతి తీసుకోలేదు. రివర్స్ స్వింగ్ కోసం భారత పేసర్లు ప్రయత్నించారు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రూట్ ముందుకొచ్చి డ్రైవ్ ఆడబోయి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. స్టోక్స్ కూడా ఆచితూచి ఆడి అలీకి మద్దతుగా నిలిచాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ మినహా స్టోక్స్ తన సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. సెషన్‌లో అలీ, రూట్‌లతో పాటు స్టోక్స్ కూడా బాగా ఆడటంతో ఇంగ్లండ్ ఆధిపత్యం నడిచింది. అలీ 99 పరుగులతో రోజును ముగించాడు.
ఓవర్లు: 29; పరుగులు: 102; వికెట్లు: 1
 
డీఆర్‌ఎస్ అలా మొదలైంది
భారత్‌లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా డీఆర్‌ఎస్‌ను వినియోగించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ దీనిని వినియోగించుకున్నాయి. తొలుత జడేజా బౌలింగ్‌లో కుక్ ఎల్బీగా అవుటైనప్పుడు ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూకు వెళ్లాలని భావించినా... నాన్ స్ట్రయికర్ హమీద్ సలహా మేరకు వెళ్లలేదు. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్ బయటకు వెళుతున్నట్లు తేలింది. ఒకవేళ రివ్యూ అడిగి ఉంటే కుక్ అవుటయ్యేవాడు కాదు. ఇక హమీద్ ఎల్బీగా అవుటైనప్పుడు నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న రూట్ సలహా మేరకు రివ్యూ అడిగాడు. అందులో తను అవుటైనట్లు తేలింది.

భారత్ కూడా టీ విరామానికి ముందు డీఆర్‌ఎస్‌ను వినియోగించుకుంది. రూట్ 92 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్‌కు వెళితే అంపైర్ తిరస్కరించారు. దీంతో భారత్ రివ్యూకు వెళ్లింది. బంతి లెగ్‌స్టంప్ బయటకు వెళుతున్నట్లు తేలడంతో భారత ప్రయత్నం వృథా అయింది.
 
షమీకి సమస్యేం లేదు
తొలి రోజు రెండో సెషన్‌లో బౌలింగ్ చేస్తుండగా షమీ తొడకండరాల సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఆఖరి సెషన్‌లో తిరిగి వచ్చి బౌలింగ్ చేసినా తను ఇబ్బందిగానే కనిపించాడు. దీంతో తనకు గాయం అయిందనే అనుమానం వచ్చింది. అయితే తనకు గాయం లేదని, కేవలం ‘క్రాంప్స్’తో ఇబ్బందిపడ్డాడని, రెండో రోజు బౌలింగ్ చేస్తాడని భారత జట్టు తెలిపింది.
 
 12  
 2013లో క్లార్క్ సెంచరీ చేసిన తర్వాత 12 టెస్టుల పాటు విదేశీ ఆటగాడెవరూ భారత్‌లో సెంచరీ చేయలేదు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు రూట్ సాధించాడు.
 
 179

 గత రెండు సీజన్లలో విదేశీ ఆటగాళ్లు నమోదు చేసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇది (నాలుగో వికెట్‌కు రూట్, అలీ)
 
 20
 భారత్‌లో విదేశీ జట్టు టెస్టు ఇన్నింగ్‌‌సలో 300 పైచిలుకు పరుగులు చేసి కూడా మూడేళ్లయింది. వరుసగా 20 ఇన్నింగ్‌‌స పాటు ఏ విదేశీ జట్టు భారత్‌పై 300 చేయలేదు.
 
 1
 భారత్‌లో విదేశీ జట్టు టెస్టు ఇన్నింగ్‌‌సలో 300 పైచిలుకు పరుగులు చేసి కూడా మూడేళ్లయింది. వరుసగా 20 ఇన్నింగ్‌‌స పాటు ఏ విదేశీ జట్టు భారత్‌పై 300 చేయలేదు.
 
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌స: కుక్ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 21; హమీద్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 31; రూట్ (సి) అండ్ (బి) ఉమేశ్ 124; డకెట్ (సి) రహానే (బి) అశ్విన్ 13; మొరుున్ అలీ బ్యాటింగ్ 99; స్టోక్స్ బ్యాటింగ్ 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (93 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 311.
వికెట్ల పతనం: 1-47; 2-76; 3-102; 4-281.
బౌలింగ్: షమీ 12.1-2-31-0; ఉమేశ్ యాదవ్ 18.5-1-68-1; అశ్విన్ 31-3-108-2; జడేజా 21-2-59-1; అమిత్ మిశ్రా 10-1-42-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement