కపిల్‌దేవ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కపిల్‌దేవ్‌ను గజమాలతో సత్కరిస్తున్న ఎంవీవీ తదితరులు
విశాఖ స్పోర్ట్స్: ‘విశాఖలో క్రికెట్ అంటే ఇంత అభిమానం ఉన్నందుకు, ఇంత ఘనంగా ఓ టోర్నమెంట్ నిర్వహించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేనంటే ఇంత ప్రేమానురాగాలు మీలో ఉన్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియకుండా ఉంది.’ అని చాంపియన్లకు చాంపియన్, 1983 క్రికెట్ ప్రపంచకప్ హీరో కపిల్‌దేవ్ అన్నారు. తన పట్ల ఇంత గౌరవం చూపిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖలో అద్వితీయ రీతిలో జరిగిన ఎంవీవీ టీ10 క్రికెట్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవానికి కపిల్‌దేవ్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందించారు. ఆయనతోపాటు నిర్వాహకులు ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహాకాల్ని బహుకరించారు. గురజాడ కళాక్షేత్రలో మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ ఆ«ధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తలు, అధ్యక్షులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అవకాశాలు అందుకోండి
నలభై రోజుల పాటు అద్భుతంగా నిర్వహించిన టీ10 క్రికెట్ టోర్నీని కపిల్ ఎంతగానో మెచ్చుకున్నారు. నిర్వాహకుల కృషితో 400కు పైగా జట్లు పోటీలో తలపడ్డ సంగతిని ఆయన ప్రస్తావంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమ ప్రారంభంలో వేదికపైకి వస్తున్న కపిల్‌దేవ్‌కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తూన్నే క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ ‘నేనేం మిమ్మల్మి ఓట్లు ఆడిగేందుకు రాలేదు. రాజకీయ నాయకుడిని కాదు.’ అని ఛలోక్తి విసిరారు. క్రీడల పట్ల ఇంత అభిమానం చూపిస్తున్న వారందరికీ దన్యవాదాలు తెలిపారు. క్రీడాభిమానుల్ని పలుకరించేందుకే విశాఖ వచ్చానన్నారు. ఇలాంటి మీట్ చేయడానికి పూనుకున్న ఎంవీవీకి ధన్యవాదాలు తెలపాలంటూ సభికులను కోరారు.
చారిత్రాత్మక విజయం
ఆస్ట్రేలియాను వారిగడ్డ మీదే ఓడించి సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టును కపిల్ ఎంతగానో ప్రశంసించారు. 1983లో భారత్ ప్రపంచ కప్ సాధించడమే ఒక అద్భుతమని అన్నారు. క్రికెట్ ఓ వర్ణనాతీత ఆనందమని, దానిని తాను ఆస్వాదించానని చెప్పారు. 1983లో వరల్డ్ కప్ సాధించిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దక్షిణ భారతదేశం అంటే తనకు ఎంతో ఇష్టమంటూనే విశాఖ చక్కటి నగరం అంటూ కితాబును ఇచ్చారు.
షష్టిపూర్తి ఘట్టం
జనవరి ఆరో తేదీతో ఈ హర్యానా హరికేన్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60వ వసంతంలోకి ఆడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన చేత ప్రత్యేక కేకును కట్ చేయించారు. గజమాలతో సత్కరించారు. దుశ్శాలువ కప్పి కపిల్‌దేవ్‌తో ఫోటో తీయించుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సైతం పోటీపడ్డారు.
సాంస్కృతిక కార్యక్రమాలు రసవత్తరం
అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు సభికులను అలరించారు. శాస్త్రీయ నృత్యాలతో మైమరపించారు. తొలుత కపిల్‌దేవ్‌తో సహా వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు, అధ్యక్షులు, సమన్వయకర్తల జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్రీడాకారుల ప్రోత్సాహానికే..
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించామన్నారు. సహకరించిన సమన్వయకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మళ్ల విజయ్‌ప్రసాద్, తైనాలవిజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, వంశీకృష్ణ, నాగిరెడ్డి, కేకేరాజు, శ్రీనివాసరావు, కోలాగురువులు, నర్సగౌడ్, సిద్ధపాండే, కొండారాజీవ్, వెంకటలక్ష్మి, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
ఎంవివి టీ10 క్రికెట్ చాంపియన్‌షిప్‌ను వంశీకృష్ణ ఎలెవెన్(తూర్పు) జట్టు కైవసం చేసుకుంది. రన్నర్సప్‌గా న్యూకాలనీ ఎలెవెన్ (ఉత్తర) జట్టు నిలిచింది. తృతీయ స్థానంలో ఉప్పాడ వారియర్స్ (భీమిలి), నాలుగో స్థానంలో కార్తీక్ ఎలెవెన్(గాజువాక) నిలిచాయి. బెస్ట్ ఫైటింగ్ టీమ్‌గా టాప్ స్టార్స్, ఎస్‌కోట జట్టు అవార్డు అందుకుంది. టోర్నీలో చక్కటి ప్రతిభ కనబరిచిన అనిల్‌కుమార్ (ఉత్తర) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోగా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా పీవీ శ్యాంప్రసాద్ (తూర్పు) నిలిచాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా సిహెచ్ వేణు (తూర్పు), బెస్ట్ బౌలర్‌గా బి.ప్రశాంత్ (ఉత్తర), బెస్ట్ కీపర్‌గా డి.వినోద్‌కుమార్(ఉత్తర) నిలిచారు. విజేత జట్టుకు వంశీకృష్ణ, రన్నరప్‌కు కేకేరాజు, సెమీ లూజర్స్‌కు గుడివాడ ఆమర్‌నాథ్ ట్రోఫీలు, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. విజేత జట్టుకు రెండు లక్షల నగదు ప్రోత్సాహకాన్ని క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్‌తో పాటు ఎంవీవీ సత్యనారాయణ అందించగా రన్నర్సప్‌కు లక్ష, సెకండ్ రన్నర్సప్‌కు ఆరలక్ష, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు పాతికవేలను నగదు ప్రోత్సాహకంగా అందించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు పదివేలు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో ఉత్తమ ప్రతిభ చూసిన వారికి మూడేసి వేల వంతున బహుకరించారు. బెస్ట్ ఫైటింగ్ జట్టుకు ఐదువేలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment