ముంబై ఇండియన్స్ 'హ్యాట్రిక్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రోహిత్ శర్మ సేన నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ ను ఓటమితో ప్రారంభించిన ముంబై, ఆపై వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఏడు బంతులుండగానే ఛేదించిన ముంబై తమ బ్యాటింగ్ లో బలాన్ని చాటుకుంది.
మ్యాచ్ ఆరంభంలో ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై ఇండియన్స్ ఆపై పుంజుకుని అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ముంబై విజయంలో కీరన్ పొలార్డ్(70;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కృనాల్ పాండ్యా(37;30 బంతుల్లో3 ఫోర్లు, 1సిక్స్) కీలక పాత్ర పోషించారు. ఈ జోడి ఆరో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ముంబై సునాయాసంగా విజయం సాధించింది.
బద్రీ హ్యాట్రిక్..
ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బద్రీ ఈ ఘనత నమోదు చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేసిన బద్రీ.. ఆ తరువాత బంతికి మెక్లీన్ గన్ ను డకౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 142 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ద్వారా తొలి మ్యాచ్ ఆడుతున్న విరాట్(62;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి తొలుత ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. క్రీజ్ లో కుదురుకున్న తరువాత కోహ్లి తనదైన శైలిలో్ బ్యాట్ ఝుళిపించాడు. ప్రధానంగా ముంబై బౌలర్ టిమ్ సౌథీ వేసిన మూడో ఓవర్ లో్ విరాట్ దూకుడుగా ఆడాడు. ఆ ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన కోహ్లి..ఆ తరువాత మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలచాడు. ఆ ఓవర్ లో 17 పరుగులు పిండుకుని ఆర్సీబీ స్కోరు బోర్డులో వేగం పెంచాడు. ఆపై ఆడపా దడపా బౌండరీలు సాధిస్తూ రన్ రేట్ ను కాపాడుకుంటూ వచ్చాడు.
అయితే క్రిస్ గేల్(22) తొలి వికెట్ గా అవుటైన తరువాత కోహ్లి కాస్త నెమ్మదించాడు. కాగా, బూమ్రా వేసిన 14 ఓవర్ మూడో బంతిని డివిలియర్స సిక్స్ కొట్టగా, ఆ తరువాత ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్, ఫోర్ లుగా మలచాడు కోహ్లి.ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత కోహ్లి రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆపై స్వల్ప విరామాల్లో బెంగళూరు వికెట్లను చేజార్చుకోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు నిరాశపరిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు సాధించగా,హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.