ఐపీఎల్-10లో తొలి హ్యాట్రిక్
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బద్రీ ఈ ఘనత నమోదు చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేసిన బద్రీ.. ఆ తరువాత బంతికి మెక్లీన్ గన్ ను డకౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు.
బద్రీ దెబ్బకు ముంబై ఇండియన్స్ ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్సీబీ విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆదిలోనే తడబడి కీలక వికెట్లను చేజార్చుకుంది. ఈ హ్యాట్రిక్ కు ముందు జాస్ బట్లర్(2) ను స్టువర్ట్ బిన్నీ అవుట్ చేశాడు.