ప్లే ఆఫ్కు ముంబై!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10 సీజన్ లో ముంబై ఇండియన్స్ దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి నాకౌట్ దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్ లో ఓటమిని ఎదుర్కొన్న ముంబై.. ఆ తరువాత తన జోరును కొనసాగించి వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తద్వారా 11 మ్యాచ్ లకు గాను ఎనిమిదింట గెలుపొంది పాయింట్ల పట్టికలో టాప్ కు చేరింది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తును పదిలంగా ఉంచుకున్నట్లే.
ఈ రోజు మ్యాచ్ లో 163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ముంబై బ్యాటింగ్ లో పార్ధీవ్ పటేల్ తొలి బంతికి డకౌట్ గా చేరినప్పటికీ, జాస్ బట్లర్(33), నితీష్ రానా(22)లు ఫర్వాలేదనిపించారు. ఆ తరువాత రోహిత్ శర్మ(56 నాటౌట్;37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడాడు. అతనికి పొలార్డ్(17),హార్దిక్ పాండ్యా(14 నాటౌట్ ; 1 సిక్సర్) తమ సహకారం అందివ్వడంతో ముంబై ఇంకా బంతి ఉండగానే విజయం సొంతం చేసుకుంది.
అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 163 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు కోహ్లి, మన్ దీప్ సింగ్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే మన్ దీప్ సింగ్(17), విరాట్ కోహ్లి(20)లు ఇద్దరూ నిరాశపరిచి పెవిలియన్ కు చేరారు. బెంగళూరు 31 పరుగుల వద్ద మన్ దీప్ అవుట్ కాగా, ఆపై మరో తొమ్మిది పరుగుల వ్యవధిలో కోహ్లి వెనుదిరిగాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్(43;27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
కాగా, అవతలి ఎండ్ నుంచి డివీకి పెద్దగా సహకారం లభించలేదు. స్కోరును పెంచే యత్నంలో షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు డివిలియర్స్. ఆపై పవన్ నేగీ(35;23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, కేదర్ జాదవ్(28;22 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దాంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.