‘మలేసియా’పై సైనా, శ్రీకాంత్ గురి
కౌలాలంపూర్: స్వదేశంలో ‘సూపర్’ విజయాన్ని సాధించిన జోరులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మరో ‘సూపర్ సిరీస్’ టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజున క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
‘ఇండియా ఓపెన్’ టైటిల్స్ నెగ్గిన తర్వాత ఆదివారం రాత్రే వీరిద్దరూ మలేసియాకు బయలుదేరి వెళ్లారు. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37,500 డాలర్ల చొప్పున లభిస్తాయి. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; మరియా ఫెబి కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సైనా తలపడతారు. వీరిద్దరితోపాటు కశ్యప్, ప్రణయ్, గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.