తొలిటెస్టులో పాక్ చేతిలో లంక చిత్తు
గాలె: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. తొలి టెస్టులో పాక్ 10 వికెట్లతో లంకపై ఘనవిజయం సాధించింది. పాక్ స్పిన్నర్ యాసిర్ షా (7/76) కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2006 తర్వాత శ్రీలంకలో పాక్కిదే తొలి టెస్టు విజయం.
మ్యాచ్ చివరి రోజు ఆదివారం 90 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ వికెట్ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (46 నాటౌట్), షెహ్జాద్ (43 నాటౌట్) శుభారంభం అందించి జట్టుకు ఘనవిజయం అందించారు. అంతకుముందు పాక్ బౌలర్ యాసిర్ ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ల్లో లంక 300, పాక్ 417 పరుగులు చేశాయి.