అది సమస్యకు పరిష్కారం కాదు:వీవీఎస్
హైదరాబాద్: మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లను వేరే చోటకు తరలించాలనడం ఎంతమాత్రం సరికాదని మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సలహాదారు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అసలు రాష్ట్రంలోని నీటి కరువుకు, ఐపీఎల్ మ్యాచ్ లకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇక్కడ నిర్వహించే మ్యాచ్ లను వేరే చోటకి తరలించడంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నాడు.
'ఐపీఎల్ మ్యాచ్లను మహారాష్ట్ర నుంచి తరలించాలంటూ పేర్కొనడం సమస్యకు పరిష్కారం కాదు. నీటి సమస్యకు తొలుత పరిష్కారం వెతకండి. ముంబైలో జరిగే మ్యాచ్లను తరలించాలనడం నిజమైన పరిష్కారమైతే కాదు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు.ఇదొక జాతీయ సమస్య. దేశంలో చాలా చోట్ల నీటి సమస్య ఉంది. గ్లోబర్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు రావడం మనం చూశాం. తద్వారా దేశ వ్యాప్తంగా నీటి కొరత అధికంగానే ఉంది. ఇందుకోసం ప్రత్యేక డిపార్టమెంట్లను ఏర్పాటు చేసి అందుకు తగిన పరిష్కారాన్ని వెదకడానికి ప్రభుత్వం కృషి చేయాలి' అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు.