ఇండోర్: సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో నాణ్యమైన పేసర్ల కొరత ఉందని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అందువల్లే ఐదు రోజుల ఆటలో బ్యాట్‌కు, బాల్‌కు మధ్య హోరాహోరీ పోరు కరువైందని విశ్లేషించాడు. 1970, 80 దశకాల్లో సునీల్ గావస్కర్‌తో అండీ రాబర్ట్స్, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగేది. అనంతరం సచిన్–మెక్‌గ్రాత్, సచిన్–వసీమ్ అక్రమ్‌ల మధ్య కూడా దీటైన పోరు జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మంది నాణ్యమైన సీమర్లు ఉండటంతో ఆ పోరే కరువైందని సచిన్ అన్నాడు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 నవంబర్ 15న సచిన్ టెండూల్కర్ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు.
ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాల్లో టెస్టు క్రికెట్‌లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ ‘క్రికెట్‌లో ప్రమాణాలు తగ్గడం టెస్టులకు మంచిది కాదు. నాణ్యత పెరిగితేనే ఆట బతుకుతుంది. పిచ్‌లలో జీవం కొరవడటమే అసలు సమస్య’ అని అన్నాడు. బ్యాట్‌కు బంతికి మధ్య హోరాహోరీ జరిగే సమతుల్యమైన పిచ్‌లను తయారు చేస్తేనే టెస్టు క్రికెట్ ఆసక్తిరేపుతుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ పోరు రసవత్తరంగా జరిగిందని అన్నాడు. 1999లో చెన్నైలో పాక్‌తో జరిగిన టెస్టులో వెన్నునొప్పితో బాధపడుతూ చేసిన సెంచరీ, 2004లో సిడ్నీలో సాధించిన డబుల్ సెంచరీ, 2011 కేప్‌టౌన్‌లో స్టెయిన్‌తో జరిగిన పోరు తన కెరీర్‌లో పెద్ద సవాల్‌గా నిలిచిన ఇన్నింగ్స్‌లని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment