వినయ్ ‘సిక్సర్’
బెంగళూరు: రంజీ ట్రోఫీ చాంపియన్ కర్ణాటక జట్టు కెప్టెన్ ఆర్. వినయ్ కుమార్ సొంత గడ్డపై చెలరేగాడు. వినయ్ (6/47) అద్భుత బౌలింగ్‌కు రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 201 పరుగులకే ఆలౌటైంది.
ఒంటరి పోరాటం చేసిన దినేశ్ కార్తీక్ (184 బంతుల్లో 91; 14 ఫోర్లు) సెంచరీ కోల్పోయాడు. అమిత్ మిశ్రా (61 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... గంభీర్ (66 బంతుల్లో 22; 1 ఫోర్) విఫలమయ్యాడు. స్టువర్ట్ బిన్నీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఉతప్ప (0) డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ (28 బ్యాటింగ్), గణేశ్ సతీశ్ (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి బంతి నుంచే...
టాస్ గెలిచిన కర్ణాటక ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. పిచ్‌పై ఉన్న పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకున్న వినయ్ కుమార్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే జీవన్ జ్యోత్ సింగ్ (0)ను అవుట్ చేసిన వినయ్, రెస్టాఫ్ పతనానికి శ్రీకారం చుట్టాడు. తన రెండో ఓవర్లో అపరాజిత్ (2), మూడో ఓవర్లో జాదవ్ (2)లను వినయ్ పెవిలియన్ పంపించాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించిన గంభీర్, బిన్నీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంటనే మన్‌దీప్ సింగ్ (5)ను కూడా బిన్నీ అవుట్ చేయడంతో రెస్ట్ స్కోరు 62/5 వద్ద నిలిచింది.
రాణించిన కార్తీక్...
ఈ దశలో కార్తీక్, మిశ్రా కలిసి రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం శరత్ ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో కార్తీక్ 143 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు హర్భజన్ సింగ్ (46 బంతుల్లో 25; 3 ఫోర్లు) కొద్ది సేపు కార్తీక్‌కు సహకరించాడు. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరు వెనుదిరిగారు. తర్వాతి ఓవర్లోనే వినయ్ కుమార్ వరుస బంతుల్లో అనురీత్ సింగ్ (0), పంకజ్ సింగ్ (0)లను అవుట్ చేసి రెస్ట్ ఇన్నింగ్స్‌కు తెర దించాడు.