వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ
మైసూర్: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ తోపాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు వీడ్కోలు చెప్పిన భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాటింగ్ లో పవర్ ను మరోసారి రుచిచూపించాడు. రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ లో భాగంగా హరియాణాతో తరపున ఆడుతున్న సెహ్వాగ్.. కర్ణాటకపై సెంచరీ నమోదు చేశాడు. మైసూర్ లో గురువారం కర్ణాటక-హరియాణాల మధ్య ఆరంభమైన మ్యాచ్ లో వీరూ (136; 170 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్ లు) తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో 80.00 స్ట్రైక్ రేట్ తో సెహ్వాగ్ ఆకట్టుకున్నాడు.
మరో ఆటగాడు జయంత్ యాదవ్(100) కూడా సెంచరీ నమోదు చేయడంతో హరియాణా తన తొలి ఇన్నింగ్స్ లో 90.1 ఓవర్లలో 331 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక 58.0ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సెహ్వాగ్ రిటైర్మెంట్ తీసుకున్నా.. ముందుగా హర్యానా క్రికెట్ సంఘానికి ఇచ్చిన మాట ప్రకారం అతను ఈ సీజన్‌లో రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నాడు.