రసపట్టులో ‘లాహ్లి’ మ్యాచ్
లాహ్లి (రోహ్‌టక్): రంజీ ట్రోఫీలో తన చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ వైఫల్యంతో నిరాశ చెందిన అభిమానులకు అతని బ్యాటింగ్‌ను చూసేందుకు మరో అవకాశం! డిఫెండింగ్ చాంపియన్ ముంబై, హర్యానా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న ఇక్కడి వికెట్‌పై రెండో రోజు సోమవారం కూడా 15 వికెట్లు నేలకూలాయి. ఫలితంగా లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడో రోజే ముంబై బ్యాటింగ్‌కు దిగాల్సి రావచ్చు. దాంతో సచిన్ ఆటను మరోసారి వీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ సారైనా మాస్టర్ తన శైలిలో మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చెలరేగిన జోగీందర్...
100/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు సోమవారం ఆట ప్రారంభించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 136 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆ జట్టుకు కేవలం 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రహానే (51) ఒక్కడే రాణించాడు. హర్యానా బౌలర్ జోగీందర్ శర్మ 16 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీసాడు. అనంతరం హర్యానా తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్నీ సింగ్ (63) అర్ధ సెంచరీ చేశాడు. జహీర్ , దభోల్కర్ చెరో 4 వికెట్లు తీసి హర్యానాను కట్టడి చేశారు. ప్రస్తుతం ఒక వికెట్ చేతిలో ఉన్న హర్యానా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది.