ఆర్మీలో చేరదామనుకున్నా: ధోనీ
న్యూఢిల్లీ: సమకాలిన క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసలు క్రికెటర్ కావాలనుకోలేదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాను సైనికుడు కావాలనుకున్నానని కానీ క్రికెటర్ అయ్యానని తెలిపాడు. 'ఆర్మీలో చేరి సైనికుడవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని. ఏదోక రోజు జవాన్ అవుతానని ఆలోచిస్తూ ఉండేవాడినని' అని ధోని పేర్కొన్నాడు.
రాంచీ పారాచ్యూట్ రెజిమెంట్లో ధోనీ ఒకరోజు గడిపాడు. ఈ సందర్భంగా 'ఆజ్ తక్'తో మాట్లాడుతూ.. సైనిక యూనిఫాంలో ఏదో ప్రత్యేకత ఉందన్నాడు. సైనిక దుస్తులు ధరించడానికి తానప్పుడు భయపడలేదని చెప్పాడు. పలువురు సైనికులు అడిగిన పశ్నలకు మిస్టర్ కూల్ సమాధానాలిచ్చాడు. ఒత్తిడి జయించేందుకు మౌనంగా ఉంటానని వెల్లడించాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా టీ20, వన్డే ప్రపంచకప్లు గెలిచిన సంగతి తెలిసిందే.