రైతాంగ సమస్యలపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టనుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వివిధ రూపాల్లో చేపట్టే ఆందోళనల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. రైతులకిచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. రాష్ర్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.
గత రెండున్నరేళ్ల కాలంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాల కింద రాష్ట్రానికి రూ.90 వేల కోట్ల మేర ఇచ్చినా కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం అసత్యప్రచారం చేయడాన్ని ఖండించాలని గురువారం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు.
ఈ భేటీలో బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు, ఇతర నేతలు చందుపట్ల జంగారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, చందా లింగయ్యదొర, మేచినేని కిషన్‌రావు, దిలీప్‌కుమార్, బద్ధం బాల్‌రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, యెండల లక్ష్మీ,నారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, నేరెళ్ల ఆంజనేయులు, జైపాల్, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.
సచివాలయంలో ధర్నాతో శ్రీకారం...
ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు గురువారం నాడే బీజేపీ నేతలు తమ కార్యాచరణను ప్రారంభించారు. కేంద్రం కరువు సహాయం కింద విడుదల చేసిన రూ.791 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ కింద చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తంచేస్తూ సచివాలయంలో సీఎస్‌కు వినతిపత్రం సమర్పించి, సీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా రైతులకు పంటల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాల్సిందిగా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ భావిస్తోంది. అలాగే నకిలీ విత్తనాల సమస్య, రబీలో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశలో వివిధ కార్యక్రమాలకు బీజేపీ తుదిరూపునిస్తోంది.