సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
పెరంబూర్(చెన్నై): తమిళ సినీప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని శుక్రవారం ఉదయం సచివాలయంలో కలిశారు. సుమారు గంట పాటు జరిగిన వీరి భేటీలో సినీరంగానికి సంబంధించిన పైరసీ తదితర పలు సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నడిగర్‌సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ విలేకరులతో మాట్లాడుతూ సినిమాల షూటింగ్ సందర్భాల్లో పలు సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందన్నారు.
దీంతో చిత్రాల విడుదల సమయాల్లో నిర్మాతలు నష్టాలకు గురవుతున్నారన్నారు.ఈ విషయాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు.అదే విధంగా జూన్ నుంచి జీఎస్టీ ముసాయిదా అమలు కానున్న నేపథ్యంలో తద్వారా సినీరంగానికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఇక కొత్త చిత్రాల విడుదల సమయంలోనే వెబ్‌సైట్లలో అక్రమంగా ప్రసారం చేస్తున్నారని, అలాంటి పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
అదే విధంగా చిన్న చిత్రాలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొన్నేళ్లుగా ఆగిపోయిందన్నారు.దాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు అందించే అవార్డుల ప్రదానోత్సవకార్యక్రమాలను 7 ఏళ్లుగా నిర్వహించడం లేదన్నారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రితో భేటీ అయిన సమయంలో విశాల్‌తో పాటు థియేటర్ సంఘ నిర్వాహకులు అభిరామిరామనాథన్, పన్నీర్‌సెల్వం, నిర్మాతల మండలి కోశాధికారి కదిరేశన్, జ్ఞానవేల్‌రాజా, నటుడు ప్రకాశ్‌రాజ్, దర్శకుడు గౌతమ్‌మీనన్ ఉన్నారు.