మద్యంమత్తులో యువతి వీరంగం
న్యూఢిల్లీ: నేపాల్కు చెందిన ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై చేయిచేసుకుంది.
ఆదివారం ఉదయం మునిర్కాలో నేపాల్ యువతి (28) ఆటో ఎక్కింది. అప్పటికే అతిగా మద్యంతాగిన ఆమె ఆటో డ్రైవర్ను వేధించడం మొదలు పెట్టింది. డ్రైవర్ను బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో అతను పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. ఆటో నుంచి దిగకుండా సతాయిస్తోందని, తనను కొడతానంటూ బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటోను తీసుకెళ్లి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆపాడు. పోలీసులు రావడంతో వారి పట్లా ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఓ మహిళ కానిస్టేబుల్ను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టింది. మరో మహిళా కానిస్టేబుల్ను దూషిస్తూ దాడి చేసింది. పోలీసులు నేపాల్ యువతిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్ష కోసం సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మద్యంతాగినట్టు పరీక్షల్లో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఆటో డ్రైవర్ తన సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.